Jubilee Bus Station: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జేబీఎస్ బస్ స్టేషన్కు వెళ్తున్నరా..

Jubilee Bus Station: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జేబీఎస్ బస్ స్టేషన్కు వెళ్తున్నరా..

సికింద్రాబాద్: జేబీఎస్ బస్ స్టేషన్ ఇవాళ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 16న వరలక్ష్మి వ్రతం, 17, 18 వీకెండ్ కావడంతో.. సిటీలో ఉద్యోగాలు చేస్తున్న పబ్లిక్ సొంతూళ్ల బాట పట్టారు. స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో జేబీఎస్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లో పండుగల సమయంలో కనిపించే దృశ్యాలు కనిపించాయి. ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా ప్రయాణికులు ఫుల్ ఉన్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సుల్లో ఖాళీ లేని పరిస్థితి.

వరుస సెలవులతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో పనిలోపనిగా అన్నీ చూసుకుని వచ్చేయొచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే పబ్లిక్ బస్సులు, రైళ్లలో ముందే బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకోకుండా నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు, జేబీఎస్, ఎంజీబీఎస్ వెళుతున్న ప్రయాణికులు సీట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ ఏరియాల్లో గురువారం ఫుల్ రష్ కనిపించింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సిటీ నుంచి ఏపీకి వెళ్లే వారితో ఎల్బీనగర్ బస్టాప్ ఏరియాలో రద్దీ నెలకొంది. సిటీ నుంచి చాలామంది ఓన్​ వెహికల్స్లో సొంతూర్లకు బయలుదేరగా.. శివారు ప్రాంతాలతో పాటు బీబీనగర్ టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా వద్ద  కిలోమీటర్ల  మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్– విజయవాడ హైవేపై వెహికల్స్ చాలాసేపు ట్రాఫిక్​లో నిలిచిపోయాయి.

ఇక.. సెలవులకు సొంతూర్లకు వెళ్లే వారిని పోలీసులు అలర్ట్ చేశారు. డబ్బు, బంగారు నగలు సహా విలువైన వస్తువులను ఇండ్లలో పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు.శివారు ప్రాంతాల్లోని గేటెడ్‌‌ కమ్యూనిటీలు, కాలనీల్లో ఆటోలతో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఊర్లకు వెళ్ళే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో, కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు తిరిగితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. డబ్బు, బంగారం, వెండి బ్యాంక్ లాకర్స్‌‌లో భద్రపరచాలని, ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను ఆన్‌‌లోనే ఉంచాలని చెబుతున్నారు. నమ్మకమైన వారిని మాత్రమే వాచ్‌‌మన్‌‌గా పెట్టుకోవాలని, ఇంట్లో, బయట లైట్లు ఆన్‌‌లో ఉంచాలన్నారు. సొంతూరికి వెళ్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయొద్దని సూచించారు.