
- స్వామి వారి దర్శనానికి ఐదు గంటల టైం
వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం రాత్రే వేములవాడకు చేరుకున్న భక్తులు సోమవారం ఉదయం కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. తదనంతరం ఆలయ ధర్మగుండంలో స్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. తమ కోర్కెలు తీర్చాలంటూ స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించారు.
భక్తుల రద్దీ కారణంగా దర్శన క్యూలైన్, కోడెలు, ప్రసాదం కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. మరో వైపు భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జబర్దస్త్ ఫేమ్ అవినాశ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.