- .బస్సులు, సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు
- ధర్మదర్శనానికి 6, ప్రత్యేక దర్శనానికి రెండున్నర గంటల సమయం
- స్వామివారికి రికార్డు స్థాయిలో రూ.1.02 కోట్ల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : వేసవి సెలవులు ముగుస్తుండడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తుల రాకతో కొండపైన, కింద పరిసరాలన్నీ కిక్కిరిశాయి. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండైపన బస్‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి ఆరు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది.స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పార్కింగ్ మొదలు దర్శనం వరకు అన్నీ కష్టాలే...
యాదగిరిగుట్టు నారసింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు పార్కింగ్ మొదలుకొని దర్శనం పూర్తయ్యే వరకు తిప్పలు తప్పలేదు. భక్తులు సొంత వాహనాల్లో రావడంతో కొండ కింద ఉన్న పార్కింగ్ ఏరియా పూర్తిగా నిండడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొండపైన వాహనాల పార్కింగ్‌కు సరిపడా ప్లేస్ లేనప్పటికీ రూ.500 తీసుకొని వాహనాలను ఇష్టానుసారంగా అనుమతించారు. దీంతో వెహికల్స్‌ను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక భక్తులు నానా అవస్థలు పడ్డారు. రూ.500 తీసుకొని, పార్కింగ్‌పై చేతులెత్తేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల రద్దీకారణంగా క్యూలైన్లు, కాంప్లెక్స్‌లు నిండిపోవడం, ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. క్యూలో ఇబ్బందులు పడుతూ స్వామివారిని దర్శించుకునే సరిగా భక్తులకు చుక్కలు కనిపించాయి. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో భక్తులు మెట్ల మార్గం గుండా, ఘాట్ రోడ్డు వెంట నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం
యాదగిరిగుట్ట ఆలయానికి ఆదివారం రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజే రూ.1,02 కోట్ల ఇన్‌కం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.33,32,050, కొండపైకి వెహికల్స్ ప్రవేశంతో రూ.9 లక్షలు, ప్రధాన బుకింగ్‌తో రూ.21,58,050, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.6,81,900, వీఐపీ టికెట్లతో రూ.18.75 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.2,26,400, యాదరుషి నిలయం ద్వారా రూ.3,50,860, సువర్ణపుష్పార్చన పూజల ద్వారా రూ.2,01,940, కల్యాణకట్ట ద్వారా రూ.2,12,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 81 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం, వెలుగు : శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పాతాలగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారి దర్శనం కోసం బారులుదీరారు. దర్శనం కోసం సుమారు 5 గంటలు పడుతుందని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.