కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు

వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలా మంది తిరుమలతో పాటు చుట్టు పక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. దీంతో కాణిపాకం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో కూడా వేసవి సమయంలో రద్దీ పెరుగుతూ ఉంటుంది.ఈ క్రమంలో కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడికి భక్తులు పోటెత్తారు.సర్వ దర్శనానికి సుమారు 5గంటల సమయం పడుతోందని సమాచారం.

వేసవి సెలవులు కావటంతో క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక సామాన్య భక్తులు, చంటి బిడ్డల తల్లులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.క్యూ లైన్ల వద్ద కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో ఆలయం కిటకిటలాడుతోంది. సర్వదర్శనం క్యూ లైన్లు మాత్రమే కాకుండా రూ.50, రూ.100 క్యూ లైన్లు కూడా రద్దీగా ఉన్నాయి. ఆలయ అధికారులు VIPల సేవలో తరిస్తూ సామాన్య భక్తులను విస్మరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వేసవి సమయంలో రద్దీకి అనుగునంగా తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.