
కొమురవెల్లి, వెలుగు : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రెండవ ఆదివారం(లష్కర్ వారం)కు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం 80 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాల్లో రెండవ ఆదివారాన్ని లష్కర్ వారంగా భావిస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు, రాజగోపురం, రాతిగీరలు, కోడెల స్థంబం, తోటబావి, ఎల్లమ్మ కమాన్, బస్టాండ్ ప్రాంగణం, సినిమా టాకీస్ ప్రాంగణం, రాంసాగర్ రోడ్డులోని కుర్మసంఘం వరకు, మల్లన్న చెరువు పార్కింగ్ స్థలం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ఖాళీ స్థలాలు భక్తుల విడిదితో నిండి పోయాయి. మల్లన్న ధర్మదర్శనానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టింది. శీఘ్ర, విశిష్ట దర్శనానికి నాలుగు గంటలు, రూ.500ల వీవీఐపీ దర్శనానికి రెండు గంట సమయం పట్టింది.
మల్లన్న, ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు..
భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి, మల్లన్న కోనేరులో స్నానమానరించిన అనంతరం మట్టి కుండల్లో పసుపు బియ్యంతో నైవేద్యం వండి స్వామికి సమర్పించారు. ఏడు. ఐదు, మూడు, రెండు ఒక ఆంత్రాల బోనాలను ఎత్తుకొని శివసత్తులు సిగమూగుతూ డప్పుచప్పుళ్లతో స్వామికి మొక్కులు చెల్లించారు. గంగిరేగు చెట్టు వద్ద బోనాలు పెట్టి పట్నాలు వేసి మల్లన్నకు మొక్కులు అప్పగించారు. అనంతరం మల్లన్నగుట్ట(ఇంద్రకీలాద్రి గుట్ట)పై వెలిసిన రేణుకఎల్లమ్మకు శివసత్తులు బోనాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మను దర్శించుకోవాడానికి మూడు గంటల సమయం పట్టింది. చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ లేకపోవడతో గంటల తరబడి పిల్లలతో నిలబడి ఇబ్బందిపడ్డారు.