- సాయంత్రం 6 గంటలకు మహా లింగార్చన
- అర్ధరాత్రి 11.30 తర్వాత లింగోద్భవ ఘట్టానికి ఏర్పాట్లు
వేములవాడ, వెలుగు: శివరాత్రి ఉత్సవాల కోసం తరలివస్తున్న భక్తులతో ఎములాడ రాజన్న సన్నిధి కిటకిటలాడుతోంది. శుక్రవారం ఉదయం నుంచే ముల్లె మూట, పిల్లా పాపలతో భక్తుల రాక మొదలైంది. సాయంత్రానికి ఆలయ ప్రాంగణంతో పాటు రోడ్లు, పార్కింగ్ స్థలంలో ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఎక్కడ ఖాళీ జాగ దొరికితే అక్కడే బస ఏర్పాటు చేసుకొని రాజన్న జపం చేస్తున్నారు. తెలంగాణ నలుమూలలతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి 4 లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, మంచినీళ్లు, మరుగుదొడ్లు, పార్కింగ్సౌకర్యం కల్పించారు. కలర్ఫుల్లైటింగ్తో టెంపుల్పరిసరాలు వెలిగిపోతున్నాయి. టెంపుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 ఉచిత బస్సులను భక్తులను బస్తాండ్ నుంచి ఆలయం వరకు జారగొడ్తున్నాయి. శివరాత్రి సందర్భంగా శివ స్వాములు 4 గంటలకు దీక్ష విరమించనున్నారు. కాగా, భక్తుల కోసం వాసవి సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం చేపడ్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దంపతులు, బీజేపీ, కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
11.30 గంటలకు లింగోద్భవం..
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ ప్రధాన ఆలయంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహా లింగార్చన నిర్వహిస్తారు. అనంతరం దర్శనానికి అవకాశం కల్పిస్తామని పురోహితులు తెలిపారు. అర్ధరాత్రి 11.35 గంటల నుంచి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనాలనుకునే భక్తులు శ్రీభీమేశ్వరాలయంలో అభిషేకాలు నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
శివార్చనలో మంత్రి ఐకే రెడ్డి
గుడి చెరువు మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని మంత్రి ఐకేరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సంఖ్య ప్రకారం చూసినా, ఆదాయం ప్రకారం చూసినా వేములవాడ రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయం అని అన్నారు. లక్షల్లో వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా కృషి చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్ పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈఓ కృష్ణ ప్రసాద్, రాష్ట్ర భాష సాంసృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ, తదితరులు ఉన్నారు.