యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్టలో భక్తుల సందడి
  • ధర్మ దర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట క్యూ
  • ఒక్క రోజులో ఆలయానికి వచ్చిన ఆదాయం రూ.39.45 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి చేశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. కళ్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపాలు, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. 

స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.39,45,629 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.15,27,450, కొండపైకి వాహనాల ఎంట్రీ రూ.6 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.7.65 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.2,58,900 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.