
- నేడు పెర్సపేన్, బాన్ దేవతలకు పూజలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభమైన మహాజాతరకు బుధవారం భక్తుల తాకిడి కనిపించింది. ఉదయం గోవడ్ నుంచి సాంప్రదాయ వాయిద్యాల మధ్య నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కొత్త కుండల్లో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించిన అనంతరం సహపంక్తి భోజనలు చేశారు.
అనంతరం భేటీ కోడళ్ల ఉపవాస దీక్షలు విరమించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. నాగోబా క్షేత్రం పరిసరాలు కళకళలాడుతున్నాయి. గురువారం మూడో రోజు పెర్సపేన్, బాన్ దేవతలకు పూజలు నిర్వహించనున్నారు. దీంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ కళాకారులతో ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.