హన్వాడ/జడ్చర్ల టౌన్/గండీడ్/బాలానగర్/నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాను పొగ మంచు కమ్మేసింది. తెల్లారినా సూరీడు పొడవలేదు. ఉదయం తొమ్మిదిన్నర గంటలైనా చలి తగ్గకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. వాహనాలు నడిపే వారు పట్టపగలు లైట్లు వేసుకొని వెహికల్స్ నడపాల్సి వచ్చింది. జడ్చర్లలో తెల్లవారుజామున మంచు కురిసింది. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు పట్టణమంతా పొగమంచుతో నిండిపోయింది.
హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిదిన్నర వరకు పొగమంచు కమ్మేసింది. కాగా, పొగమంచు కారణంగా హైవేలపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎదురుగా వచ్చే వాహనం కనిపించక డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు. మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.
అయితే పొగమంచుతో రోడ్డు కనిపించక మహబూబ్నగర్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ స్టేజ్ వద్ద రోడ్డు కిందకు దూసుకెళ్లింది. క్రేన్ సాయంతో బస్సును రోడ్డు మీదికి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంచు కమ్మేయడంతో ఇండ్లు, వాహనాలు కనిపించక ప్రజలు
తిప్పలు పడ్డారు.