సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వెయ్యికి పైగా వెహికల్స్ చిక్కుకుపోయాయి. రోడ్లన్నీ మంచుతో నిండిపోవడంతో వాహనాలు స్లిప్ అవుతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్తగా 3 నేషనల్ హైవేలు సహా 177 రోడ్లను క్లోజ్ చేశారు. బుధవారం క్రిస్మస్ పండుగ కావడంతో పెద్ద సంఖ్యలో టూరిస్టులు మనాలీ బాటపట్టారు.
కిన్నౌర్, లాహౌల్, స్పితి, సిమ్లా, కులు, మండి, చంబాతో పాటు సిర్మౌర్ జిల్లాల్లో భారీగా మంచు వర్షం కురుస్తున్నది. సిమ్లాలోని అన్ని హోటల్స్ దాదాపు 70% కంటే ఎక్కువ నిండిపోయాయి. అటల్ టన్నెల్ వద్దే సుమారు 500 వెహికల్స్ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వాహనాలను క్లియర్ చేస్తున్నారు.
24 గంటల్లో నలుగురు మృతి
గడిచిన 24 గంటల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయినట్లు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రోడ్డంతా మంచుతో నిండిపోవడంతో వెహికల్స్‌కు బ్రేకులు పడటంలేదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సుమారు 700 మంది టూరిస్టులను పోలీసులు రెస్క్యూ చేశారు. రోడ్డు పక్కన నిలబడి డ్రైవర్లకు సూచనలు చేస్తున్నారు.
అట్టారి నుంచి లేహ్, కులు జిల్లాలోని సంజ్ నుంచి ఔట్ మధ్య పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ నుచి సంగం, స్పితి జిల్లాలోని గ్రామ్‌ఫూ నుంచి లాహౌల్ మధ్య ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిమ్లా జిల్లాలో 89 రోడ్లు, కిన్నౌర్‌లో 44 రోడ్లు, మండిలో 25 ర్డోలు క్లోజ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ టూరిస్టులు పాటించాలని అధికారులు సూచించారు.