
- రాజస్థాన్‌లోని బార్మెర్‌లో 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు
- రాబోయే 3 రోజుల్లో హీట్‌వేవ్ ముప్పు!
బెంగళూరు: ఉత్తరాదిని ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 5 రాష్ట్రాల్లోని 21 నగరాల్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డు కావడంతో జనం అల్లాడుతున్నారు. ఎండ వేడిమి తాళలేక సతమతమవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇండ్లల్లో ఉన్నా ఉక్కపోతతో జనం ఇబ్బందిపడుతున్నారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీకి రాబోయే మూడు రోజులు హీట్‌వేవ్స్ ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలోని నగరాల్లోనూ వేడిగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి నగరంలో 3 డిగ్రీల నుంచి 6.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.
తగ్గుతున్న గాలి వేగం
ఉత్తరాదిలోని నగరాల్లో ముఖ్యంగా ఢిల్లీలో గాలి వేగం తగ్గడం ఉక్కపోతకు కారణమవుతున్నది. ‘‘ఉదయం సమయంలో ప్రధాన ఉపరితల గాలి వేగం గంటకు 8-10 కిలో మీటర్లు ఉంటున్నది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి గాలి వేగం క్రమంగా 4-6 కిలోమీటర్లకు తగ్గుతున్నది.
సాయంత్రం, రాత్రి సమయంలో ఆగ్నేయ దిశ నుంచి గంటకు 8 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటున్నది’’ అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, రాజస్థాన్‌లోని బార్మెర్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. - ఏప్రిల్ మొదటి వారంలో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. ఏప్రిల్ 6-–10 తేదీల మధ్య గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని, సౌరాష్ట్ర , కచ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే చాన్స్ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.