మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు: మేడారం మహాజాతరలో ట్రాఫిక్ జాం ప్రధాన సమస్య. ప్రతిసారీ రోడ్లపై గంటల కొద్దీ వెహికిల్స్ ఆగిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. గత జాతర టైంలోనూ ఇలాగే జరిగింది. ఈ సారి కోటి 50 లక్షల మంది వస్తారనే అంచనా ఉంది. ఇందులో 6 వేల ఆర్టీసీ బస్సులు, 3.2 లక్షల ప్రైవేట్ వాహనాలు కాకుండా 35 వేల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు కూడా వస్తాయి.
హైదరాబాద్ టు భూపాలపట్నం 163 నేషనల్ హైవేపై 70 శాతం, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, ఆజంనగర్ మీదుగా 20 శాతం, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా 10 శాతం ట్రాఫిక్ ఉంటుందని పోలీసులు గుర్తించారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఈసారి సర్కారు ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి ఇన్చార్జిగా సైబరాబాద్ సీపీ, ఐజీ తరుణ్ జోషీని నియమించింది. జనగామ జిల్లా పెంబర్తి నుంచి మొదలుకుని మేడారం వరకు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలని ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా వెహికిల్స్ ఆగకుండా ప్లాన్ చేస్తున్నారు.
100 మీటర్లకో చెక్‌పోస్ట్..
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి 100 మీటర్ల రేడియస్ లో ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ సర్వీసెస్, వివిధ శాఖల తరపున డ్యూటీల్లో ఉన్న ఆఫీసర్ల వాహనాలు, పోలీసుల అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే చెక్ పోస్ట్‌ల నుంచి అనుమతిస్తున్నారు. చౌరాస్తాల్లో ఉన్న మేజర్ చెక్ పోస్టుల వద్ద పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించారు. దర్శనానికి వచ్చిన భక్తులు వాహనాలు పార్క్ చేసిన దగ్గరి నుంచి కాలినడకన వెళ్లి దర్శించుకునేందుకు అనువుగా ఉండేలా చర్యలు చేపట్టారు.
అలాగే ములుగు నుంచి పస్రా వరకు 28 కి.మీ దూరంలో ప్రతీ 4 కి.మీ ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ప్రకటించారు. పస్రా నుంచి మేడారం వరకు ప్రతీ 2 కి.మీ ఒక టూవీలర్ టీమ్ ఉంటుందని చెప్పారు. అలాగే మండల హెడ్ క్వార్టర్లు, వరంగల్ టౌన్‌లో కూడా పోలీసులు జాతర డ్యూటీలు చేస్తున్నారు. ఎక్కడైనా అవాంతరాలు ఎదురై వెహికిల్ ఆగిపోతే వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు కిందికి దించడానికి ఈ సారి జాతరలో పార్కింగ్ క్రేన్స్, జేసీబీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే జాతర జరిగే రోజుల్లో ప్రతిరోజు రోడ్లపై పోలీసులు టూ వీలర్లపై పర్యవేక్షించనున్నారు.