
వికారాబాద్, వెలుగు: రూ.9కే చీర అంటూ ఆఫర్ ప్రకటించడంతో వికారాబాద్లోజేఎల్ఎం షాపింగ్ మాల్ప్రారంభోత్సవానికి శుక్రవారం మహిళలు భారీగా తరలివచ్చారు. వేకువజామున నుంచే షాపింగ్ మాల్ ముందు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఆఫర్ ప్రారంభించగా, చీరల కోసం ఎగబడ్డారు. బారికేడ్లు తోసుకుని షాపులోకి వెళ్లారు.
వేల సంఖ్యలో వచ్చిన మహిళల్ని అదుపు చేయడం షాపు సిబ్బంది, పోలీసులకు సాధ్యపడలేదు. దీంతో అందరికీ చీరలు ఇవ్వలేమని యాజమాన్యం చేతులెత్తేసింది.
దీంతో మహిళలు ఉసూరుమంటూ వెనుదిరిగారు. జనం భారీగా తరలిరావడంతో వికారాబాద్ నుంచి రామయ్యగూడకు వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.