శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది. ఆదివారం (డిసెంబర్ 24) మధ్యాహ్నం నుంచి గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్, దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్డులో దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వరుస సెలవులు రావడంతో శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలివెళ్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి.. వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ ని అదుపు చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.