
హైదరాబాద్ లో రాత్రి నుంచి ముసురు పెడుతోంది. వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి సిటీలో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆఫీసులు, స్కూళ్లకు పోయే వాళ్లు అవస్థలు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో నరకయాతన పడుతున్నారు. రోడ్లపై ఓవైపు వర్షం. మరోవైపు ట్రాఫిక్ తో రెండు మూడు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.
ALSO READ :కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు తప్పవు: రసమయి బాలకిషన్
సిటీలో ప్రధాన రోడ్లు లింగంపల్లి నుంచి ఖైరతాబాద్ , సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి కోఠి వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. కేపీహెచ్ పీ జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ రోడ్డుపై 5 కి.మీ మేర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం 8 గంటలకు ఆఫీసులకు బయల్దేరిన వాళ్లు ట్రాఫిక్ కారణంగా 11 దాటినా ఆఫీసులకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.