నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగుల్ పాషా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం (జనవరి 15) రాత్రి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డుపై ధర్నాకు దిగారు. హత్యకు గురైన నాగుల్ పాషా కుటుంబాన్ని ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా వల్ల నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో సొంతూర్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ వస్తుండటంతో సాగర్ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నాగుల్ పాషా కుటుంబ సభ్యులతో మాట్లాడి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించడంతో పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
నాగార్జునసాగర్ హిల్ కాలనీ సత్యనారాయణ స్వామి టెంపుల్ సమీపంలో నాగుల్ పాషా అనే యువకున్ని వెంకటేష్ అనే మరో యువకుడు కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు తీవ్రగాయాల పాలైన నాగుల్ పాషాను నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగుల్ పాషా మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేష్ నాగుల్ పాషను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తుండగా.. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు నిందితులపై చర్యలు తీసుకోవాలని పీఎస్ దగ్గర ఆందోళనకు దిగారు.
ALSO READ | తిరుమలలో మరో విషాదం.. వసతి సముదాయం పై నుంచి పడి బాలుడు మృతి