![చెరువుల్లా ఐటీ కారిడార్ రోడ్లు.. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులకు నరకం](https://static.v6velugu.com/uploads/2023/09/Heavy-traffic-jam-on-IT-corridor-roads_5rpzhV2l0s.jpg)
మాదాపూర్/గచ్చిబౌలి : భారీ వానకు ఐటీ కారిడార్ మెయిన్ రోడ్లు చెరువులను తలపించాయి. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో వర్షం దంచికొట్టడంతో రోడ్లపై మోకాలి లోతులో నీరు నిలిచింది. ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు ఇబ్బందిపడ్డారు. వాటర్ లాగింగ్స్ కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. సైబర్ టవర్స్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే రూట్లో బాటా షోరూం వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరింది. బయోడైవర్సిటీ జంక్షన్, శిల్పారామం ఎదురుగా, కొత్తగూడ బస్టాండ్, గచ్చిబౌలి ఐఐఐటీ ఎదురుగా, సబ్ స్టేషన్ వద్ద, మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద వాన నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి, వైశాలి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా వర్షపునీటితో మునిగింది. దీంతో ఈ రూట్లలో వెహికల్స్‌ను దారి మళ్లించారు.
గచ్చిబౌలి సాయి వైభవ్, సాయి ఐశ్వర్య కాలనీల్లో మోకాలి లోతు వర్షపునీరు చేరింది. మియాపూర్పటేల్ చెరువు కట్టకు గండి పడగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చందానగర్, మియాపూర్ ఏరియాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. ఐటీ ఎంప్లాయీస్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్.. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దన్నారు.