నాలుగు రోజుల పాటు ఖాళీ రోడ్లతో దర్శనమిచ్చిన హైదరాబాద్ మహా నగరంలో మళ్లీ పాత కథ మొదలవనుంది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దాంతో, నగరానికి వచ్చే జాతీయ రహదారులన్నీ.. వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.
ఆంధ్ర నుండి హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు వస్తుండటంతో నల్లగొండ జిల్లా, కేతపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది. దీనికి తోడు స్కానర్లు పనిచేయక గేట్లు ఓపెన్ కాకపోవడంతో వాహనదారులు బారులు తీరారు. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. విజయవాడ నుండి వచ్చే వాహనాలను ఐదు లైన్ల ద్వారా నగరంలోనికి అనుమతిస్తున్నారు. VIP & ఎమర్జెన్సీ సేవల కోసం మరొక లైన్ ఏర్పాటు చేశారు.
అలాగే చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌తో నిదానంగా వాహనాల ప్రయాణం సాగుతోంది. వాహనాల రద్దీ నేపథ్యంలో సర్వర్లు మొరాయించకుండా టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.