వరంగల్​లో జోరుగా.. వీడియోకాల్​ ఫ్రాడ్స్​

వరంగల్​లో జోరుగా.. వీడియోకాల్​ ఫ్రాడ్స్​
  • స్మగ్లింగ్ చేస్తూ దొరికావంటూ ఫోన్లు    
  • సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు
  • వరంగల్ కమిషనరేట్ లో పెరుగుతున్న సైబర్ మోసాలు

'హలో.. మీ పేరున ఫలానా కొరియర్ ద్వారా ముంబై ఆంథేరి ఈస్ట్ నుంచి పార్శిల్ వచ్చింది. అందులో ప్రభుత్వ నిషేధిత వస్తువులు ఉన్నాయి. మీ మీద ఎఫ్ఐఆర్ అయింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ కు కనెక్ట్ చేస్తున్న' అంటూ హనుమకొండ కు చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 10న ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ నంటూ మరో వ్యక్తి మాట్లాడి, స్కైప్ యాప్ వీడియో కాల్ కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత 'దేశంలో మనీ లాండరింగ్ జరుగుతోంది. నిజాలు చెప్పకపోతే జైల్లో పెట్టాల్సి వస్తుంది.

మీ ఫోన్ తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ కి కలుపుతున్నా' అంటూ భయపెట్టాడు. ఇంతలోనే సైబరాబాద్ సీపీ శ్రీనివాస్ నంటూ ఇంకో వ్యక్తి లైన్ లోకి వచ్చి 'మీ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాకర్ వివరాలు తెలియాలంటే తాము చెప్పిన అకౌంట్ కి డబ్బులు పంపాలని, దానిని తాము ఆర్బీఐ ద్వారా చెక్ చేయిస్తామని చెప్పాడు. మూడు విడతల్లో రూ.7.47 లక్షలు కొట్టేశారు. విచిత్రమేమిటంటే బాధితుడిని స్కైప్ వీడియో కాల్ లో పెట్టి బ్యాంక్ కి పంపించి మరీ తమ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేలా భయపెట్టారు. ఆ తరువాత ఇంకా డబ్బులు అడగడంతో మోసపోయినట్టు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా అమాయకులను మోసం చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి.


హనుమకొండ, వెలుగు: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ట్రెండ్ మార్చేస్తున్నారు. కొత్త ఎత్తులేస్తూ జనాల ఖాతాలను కొల్లగొడుతున్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించి, వారికి వీడియో కాల్స్ చేస్తున్నారు. 'మీ పేరున పార్సల్ వచ్చింది. అందులో స్మగుల్డ్ గూడ్స్ ఉన్నయ్. వెంటనే మీకు తెలంగాణ పోలీసుల నుంచి కాల్ వస్తుంది. మీ కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేస్తాం' అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

మీ అకౌంట్ ను ఆర్బీఐ నుంచి క్రాస్ చెక్ చేయాలంటూ మనీ ట్రాన్ ఫర్ చేయించుకుంటున్నారు. వరంగల్ కమిషనరేట్ లో ఇలాంటి పెరిగిపోతున్నాయి. నమ్మించి ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు నయా ట్రెండ్ ఫాలో అవుతుండగా, మోసపోయిన బాధితులు సైబర్ స్టేషన్ బాటపడుతున్నారు. 

మూడు నెలల్లో 27 కేసులు.. 

సైబర్ నేరాలకు పాల్పడే దుండగులు ఎక్కువగా ఢిల్లీ గుర్ గామ్, ఝార్ఖండ్ జామ్తారా, రాజస్థాన్ భరత్ పూర్ నుంచి నెట్వర్క్ నడిపిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. కాగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కొరియర్ ఫ్రాడ్స్ ఎక్కువవుతున్నాయి. గడిచిన మూడు నెలల్లోనే 27 మందిని మోసం చేయగా, వారి అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ.2 కోట్లకు పైగా లూటీ చేయడం కలకలం రేపుతోంది. వీటితోపాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో అన్నీ కలిపి ఈ ఏడాది 729 సైబర్ నేరాలు నమోదు కాగా, మొత్తంగా రూ.17.11 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కొట్టేయడం గమనార్హం.

చిక్కరు.. దొరకరు

సైబర్ దుండగులు పోలీసులకు చిక్కకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఒక ఖాతా నుంచి కొట్టేసిన సొమ్మును దేశంలోని వివిధ ప్రాంతాల బ్యాంక్ లకు చెందిన  ఐదారు అకౌంట్లు మారుస్తూ డ్రా చేస్తుండగా, ఆయా కేసులను ఛేదించేందుకు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడేండ్లలో నమోదైన 2,445 కేసుల్లో 592 కేసులను ఛేదించగా, బాధితులు కోల్పోయిన రూ.46 కోట్లలో రూ.6.4 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. పోలీసులకు చిక్కకుండా సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటుండటం కలవరానికి గురి  చేస్తుండగా, ప్రజలు అవగాహనతో సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. 

వీడియో కాల్ చేసి పోలీసులమంటే నమ్మొద్దు..

కొరియర్ వచ్చిందని, అందులో ప్రభుత్వ నిషేధిత వస్తువులు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్ చేసి పోలీసులమంటూ ఎవరైనా మాట్లాడితే నమ్మొద్దు. సాధారణంగా పోలీసులు వీడియో కాల్ చేయరనే విషయం గుర్తుంచుకోవాలి. పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా ప్రజలు అవగాహనతో మెలగాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కు కంప్లైంట్  చేయాలి. - విజయ్ కుమార్, సైబర్ క్రైమ్ ఏసీపీ, వరంగల్