- జిల్లాలో ఇప్పటికే 14 మందికి డెంగ్యూ పాజిటివ్
- వైరల్ ఫీవర్స్ తో విలవిల
- రోగులకు ప్రైవేట్ హాస్పిటల్స్ కిటకిట
- గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెరుగుతున్న ఓపీ
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాను వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. విష జ్వరాలకు తోడు డెంగ్యూ సైతం విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 14 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల కోసం వస్తున్న వారిలో దాదాపు వంద మంది జ్వరాలతో బాధపడుతున్నవారు ఉంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మందికిపైగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వర్షాలు కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో పారిశుధ్యం లోపించడం, దోమలు విజృంభిస్తుండడంతో ప్రజలు విష జ్వరాల భారిన
పడుతున్నారు.
జిల్లా హాస్పిటల్లో డెంగ్యూ వార్డు ఏర్పాటు
జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యాధికారులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారికోసం ఓపీ విభాగాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా డెంగ్యూ జ్వర బాధితులకు ప్రత్యేక సేవలందించేందుకు 20 పడకలతో కూడిన స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ వార్డులో 8 మందికి పైగా డెంగ్యూ బాధితులు ట్రీట్మెంట్ తీసుకోగా, వారిలో నలుగురు డిశ్ఛార్జ్అయ్యారు. ప్రస్తుతం మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ పీహెచ్సీల పరిధిలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎం అండ్ హెచ్ఓ అధికా రులు వెల్లడిస్తున్నారు.
కిటకిటలాడుతున్న ఓపీ విభాగం
జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితో పాటు భైంసా, ఖానాపూర్ ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ప్రతిరోజు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో బాధపడుతున్న రోగులు ఉదయం 9 గంటల నుంచే ఇక్కడి ఓపీ విభాగాల్లో క్యూ కడుతున్నారు. పట్టణాల్లోని ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
జిల్లా హాస్పిటల్ కు వస్తున్న జ్వర పీడితుల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాం. జ్వర పీడితులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు స్పెషల్ వార్డు ఏర్పాటు చేశాం. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డెంగ్యూ బాధితులకు అవసరమయ్యే ప్లేట్ లెట్లను అందించడానికి ఆర్ డీపీ పరికరాన్ని కూడా హాస్పిటల్లో అందుబాటులో ఉంచాం. జ్వరాల నిరోధానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
- డాక్టర్ సునీల్, సూపరింటెండెంట్, జిల్లా హాస్పిటల్స్, నిర్మల్