
రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి
మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో 41 గేట్లు ఎత్తివేత 2లక్ష 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ, జూరాలకు వరద వచ్చి చేరుతోంది. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద
మరోవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది. ప్రాజెక్ట్ కు 3 లక్షల 50 వేల 341 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.8 అడుగులు ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో
నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ లోకి ఇన్ ఫ్లో 3 లక్షల 14 వేల 293 క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.30 అడుగుల మట్టం ఉంది. ఔట్ ఫ్లో 3 లక్షల 37 వేల 961 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం
పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే చాన్స్ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి లక్షా 18 వేల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంటడంతో ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక గణేష్ నిమజ్జనాల దృష్ట్యా అధికారులు అలెర్ట్ అయ్యారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయోద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.