లీడ్ రోల్స్‌తో పాటు గ్లామరస్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది హెబ్బా పటేల్. చేతన్ కృష్ణకి జంటగా ఆమె నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ ఇలా ముచ్చటించింది.
‘‘ రైటర్ గోపీ మోహన్ రాసిన స్ర్కిప్ట్ నాకు బాగా నచ్చింది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ మధ్య కాలంలో అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నా. ఈ సినిమా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ పేరు సుహానా. తనొక బబ్లీ గర్ల్. బాగా డబ్బున్న అమ్మాయి. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల తను కోరుకున్న వెకేషన్‌కు వెళ్తుంటుంది. అలా ఓ వెకేషన్లో హీరోను కలుస్తుంది. అక్కడి నుంచి వారి స్నేహం, ప్రేమ మొదలవుతాయి.
ఇందులో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. నాకు వారితో పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. హీరోకు ఉన్నాయి. మల్లెపూల టాక్సీ పాటలో మాత్రం వారందరితో కలిసి కనిపిస్తా. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎంటర్టైన్మెంట్తో అందర్నీ ఆకట్టుకుంటుంది. చేతన్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను మంచి కో స్టార్. మా ఇద్దరిలో ఎవరు జూనియర్ , ఎవరు సీనియర్ అనేది చూసుకోలేదు. కెమెరా ముందు ఎవరు ఎంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మ్ చేస్తాం అనేది ఆలోచించాం. డైరెక్టర్ సాయి కిషోర్ చాలా జోవియల్‌గా ఉంటారు. టీమ్ మొత్తం కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’’.