SRH vs MI: నా సీక్రెట్ అదే.. అందుకే చితక్కొడుతున్నా: క్లాసన్

SRH vs MI: నా సీక్రెట్ అదే.. అందుకే చితక్కొడుతున్నా: క్లాసన్

హెన్రిచ్ క్లాసన్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. సన్ రైజర్స్ తరపున వికెట్ కీపర్ బ్యాటర్ గా సంచలన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. ఒక మ్యాచ్ అంటే గాలి వాటం అనుకోవచ్చు. కానీ ప్రతి మ్యాచ్ లో ఈ సఫారీ ప్లేయర్ దూకుడు అసలు తగ్గట్లేదు. నిలకడగా ఆడుతూనే తనదైన శైలిలో వేగంగా పరుగులు రాబడుతున్నాడు. క్లాసన్ ఇంత బాగా బ్యాటింగ్ చేయడానికి ఆరెంజ్ కలర్ కారణమట. 

ఐపీఎల్ లో భాగంగా నిన్న (మార్చి 27) ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో క్లాసన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ 34 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 4 ఫోర్లున్నాయి. స్ట్రైక్ రేట్ 235 ఉందంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. క్లాసన్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఈ సీజన్ లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ తర్వాత పోస్ట్ ప్రెజెంటేషన్ లో మాట్లాడిన క్లాసన్ తన బ్యాటింగ్ సీక్రెట్ గురించి రివీల్ చేశాడు. 

Also Read:ముంబై కెప్టెన్‌గా రోహిత్.. హార్దిక్‌ను ఏమన్నాడంటే..?

తనకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. తన గడ్డం ఆరేంజ్ అని.. షూస్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటాయని అందుకే ఈ సీజన్ లో చెలరేగుతున్నానని క్లాసన్ ఆరెంజ్ పై తన ఇష్టాన్ని తెలిపాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ ధరిస్తున్న జెర్సీ కూడా ఆరెంజ్ కావడం విశేషం. దీంతో ఈ సఫారీ బ్యాటర్ సెంటి మెంట్ కు ఆరెంజ్ జెర్సీ కలిసి వచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు క్లాసన్ ఇప్పటివరకు రెండు మ్యాచ్ ల్లో 143 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అంతకముందు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 29 బంతుల్లోనే 8 సిక్సులతో 63 పరుగులు చేసి కేకేఆర్ ను వణికించాడు.