
టోక్యో: జపాన్‌లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. నైరుతి తీరంలోని సముద్రంలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో పేషేంట్‌తో సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం.. ఆదివారం (ఏప్రిల్ 7) నాగసాకి ప్రిఫెక్చర్‌లోని విమానాశ్రయం నుంచి ఫుకుయోకాలోని ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఓ రోగిని తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో నైరుతి తీరంలోని సముద్రంలో ప్రమాదవశాత్తూ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. సమాచారం అందుకున్న జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెంటనే రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. రెండు కోస్ట్ గార్డ్ విమానాలు, మూడు గస్తీ నౌకలతో గాలించారు. ఎయిర్ అంబులెన్స్‌లో పైలెట్‌తో సహా మొత్తం ఆరుగురు ఉండగా.. ఇందులో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. మరో ముగ్గురిని కాపాడినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు.
ALSO READ | శ్రీలంక జైళ్ల నుంచి 11 మంది భారత జాలర్లు రిలీజ్
మృతులను డాక్టర్ కీ అరకావా (34), రోగి మిత్సుకి మోటోయిషి (86), పేషెంట్ సంరక్షకురాలు కజుయోషి మోటోయిషి (68) గుర్తించారు. పైలట్ హిరోషి హమదా (66), హెలికాప్టర్ మెకానిక్ కజుటో యోషిటకే, నర్సు సాకురా కునిటకే (28)ను కాపాడినట్లు తెలిపారు. లైఫ్ బోట్ జాకెట్స్ వల్ల వీరు ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఎయిర్ అంబులెన్స్ ల భద్రతాపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.