Bangladesh PM Hasina: బంగ్లాదేశ్ ప్రధాని దేశం దాటిన దృశ్యాలివే.. వీడియో వైరల్

Bangladesh PM Hasina: బంగ్లాదేశ్ ప్రధాని దేశం దాటిన దృశ్యాలివే.. వీడియో వైరల్

ఢాకా: బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన పరిస్థితులొచ్చాయి. బంగ్లాదేశ్లో పాలన పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్మీ హెలికాఫ్టర్లో షేక్ హసీనా తన సోదరితో కలిసి భారత్లోని అగర్తలకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆమె లండన్కు వెళ్లి తలదాచుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

ఆమె దేశం విడిచి ఆర్మీ హెలికాఫ్టర్లో వెళుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. వందల మందికి పైగా నిరసనకారులు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి అధికారిక నివాసంలోకి చొచ్చుకుని వెళ్లడంతో ఆమె దేశం విడిచి వెళ్లక తప్పలేదు. ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

బంగ్లాదేశ్ స్వాంతంత్ర్యం కోసం 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో చాలా మంది ప్రాణాలర్పించారు. అమరులైన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రకటించారు. వంద శాతంలో 44 శాతం మెరిట్ ఆధారంగా, 56 శాతం రిజర్వేషన్ల పరంగా (30 శాతం అమరుల కుటుంబాలకు) ఉద్యోగాల భర్తీకి నిర్ణయించారు. అయితే.. బంగ్లాదేశ్ లో నిరుద్యోగం విలయతాండవం చేస్తుండటంతో రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాలని అక్కడి విద్యార్థులు నిరసనలకు దిగారు. 

జూన్ 5న 30 శాతం కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పు.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులకు ప్రయోజనం చేకూర్చేదిలా ఉందనేది విద్యార్థుల వాదన. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేయాలన్నది విద్యార్థుల డిమాండ్. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఆగస్ట్ 7న విచారించనుంది.