
జెరూసలెం: గాజా నుంచి సైన్యాన్ని ఉప సంహరించుకునే ఆలోచనేదీ తమకులేదని, వెంటనే బంధీలను విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ను హెచ్చరించారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ‘హెల్ ప్లాన్’ను రూపొందించినట్లు ప్రకటించారు. పార్లమెంట్లో సోమవారం (మార్చి 3) ఆయన మాట్లాడారు.
‘‘మీ వద్ద బందీలుగా ఉన్న మావాళ్లను వెంటనే విడుదల చేయాలి. లేకపోతే మీరు ఊహించలేని పరిణామాలు ఎదుర్కుంటారు. గాజా గేట్లు క్లోజ్ చేస్తాం. మిమ్మల్ని మొత్తం లాక్ చేసి.. నరకానికి తలుపులు తెరుస్తాం. ఫస్ట్ ఫేజ్ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. అందుకే గాజా స్ట్రిప్‌లోకి నిత్యవసర వస్తువుల సరఫరాను ఆపేస్తున్నం. కాల్పుల విరమణ ఒప్పంద గడువును పొడిగించుకోవాలి. లేకపోతే తగిన విధంగా బుద్ధి చెప్తం’’ అని నెతన్యాహు అన్నారు.
‘హెల్ ప్లాన్’లో భాగంగా పాలస్తీనా భూభాగంలో విద్యుత్, వాటర్ సప్లై ఆపేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. నార్త్ గాజాలో ఉన్నవాళ్లను తిరిగి సౌత్‌కు తరలిస్తున్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కిందని హమాస్ సీనియర్ అధికారి ఒసామా హమ్దాన్ తెలిపాడు. అందుకే సెకండ్ ఫేజ్ కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచిస్తున్నట్లు వివరించాడు.