హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. నేటి నుంచే (నవంబర్ 5, 2024) కఠినంగా నిబంధనలు అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 200 రూపాయలకు జరిమానాను పెంచారు.
రాంగ్ సైడ్, రాంగ్ రూట్లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్ వెళితే 2000 రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సిటీలోని రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పబ్ల ఎదురే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల గురించి.. అడిషనల్ సీపీ ట్రాఫిక్, విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. నేటి నుంచే హెల్మెట్ మస్ట్ నిబంధన అమల్లోకి తెచ్చామని చెప్పారు. బైక్ నడిపే వాళ్ళలో నూటికి నూరు శాతం మంది హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు.
స్పెషల్ డ్రైవ్లు పెట్టి నిబంధనలు అమలు చేస్తామని, రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే 2 వేల రూపాయలు ఫైన్ విధిస్తామని వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న టూ వీలర్స్ బాధితుల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారని ఆయన వివరించారు. ప్రమాదాలను నివారించేందుకే నిబంధనలు కఠినతరం చేశామని స్పష్టం చేశారు.