- పంట నష్టపోయిన రైతులను ఆదుకోరా?
- ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాల్సిందే..
- రైతు భరోసా ర్యాలీలో మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం టౌన్, వెలుగు: అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి భరోసా కల్పిస్తానని చెప్పితిరి. ఎకరానికి రూ.10 వేలు ఇస్తమంటిరి. రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఆలస్యం చేస్తున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. శనివారం చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో పొంగులేటి అనుచరులు, రైతులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్వరకు ట్రాక్టర్ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఇప్పటికే 50 రోజులు గడిచాయని, ఏ ఒక్క రైతు ఖాతాలో ఒక్క రూపాయి జమ కాలేదని, తక్షణ సాయమంటే 6 నెలలా,9 నెలలా లేక యాడాదా?’.. అని ప్రశ్నించారు. రైతుకు రూ.10 వేలు ఏ మూలకు సరిపోవన్నారు. ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014, 2018 మేనిఫెస్టోల్లో రైతులకు చేస్తాన్న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. 90శాతం రైతులకు రుణమాఫీ గడిచిన 9 ఏళ్లుగా చేయలేదన్నారు.
రైతాంగానికి ఉచితంగా ఫెర్టిలైజర్ ఇస్తానని చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో రూ.5 లక్షల కోట్లను సీఎం కేసీఆర్ అప్పు చేశారని ఆరోపించారు. రైతుల గోస కేసీఆర్ కు తప్పదని తెలిపారు. ‘ఎద్దేడ్చిన వ్యవసాయం.. ఆలి ఏడ్చిన సంసారం ఎప్పుడు బాగుపడదనే’.. విధంగా రైతుల ఉసురు తగులుతుందన్నారు. తెలంగాణ రైతులను మోడల్ గా తయారు చేశానని మహారాష్ట్రకు వెళ్లి మీ రాష్ట్రాన్ని కూడా మోడల్ గా తీర్చిదిద్దుతానని చెప్పిన సీఎం ‘అమ్మకు బువ్వ పెట్టలేని మీరు.. పిన తల్లికి బంగారు గాజులు కొనిస్తా’.. అన్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పొంగులేటి అనుచరులు, లీడర్లు పాల్గొన్నారు.