నిర్వాసితులను ఆదుకోండి : డా. మండ్ల రవి

నిర్వాసితులను ఆదుకోండి : డా. మండ్ల రవి

పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించడం బాగానే ఉంది, మరి పరిహారం సంగతి ఏంటి ? ముంపు గ్రామాల ప్రజలకు బలమైన హామీ ఇచ్చి మాట తప్పుతారా ?  వలసల జిల్లా నిత్యం కరువు కోరల్లో చిక్కుకొని తల్లడిల్లిన నేల.   పాలమూరు జిల్లాకు నీళ్ల కోసం జరిగిన యుద్ధాలు ఎన్నో, నెర్రలు  బారిన  బీడు భూముల రైతులు ఇవాళ సరైన నష్టపరిహారం దొరకక గొల్లుమంటున్నారు.   పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2015 లో ప్రారంభించారు. కానీ ఇప్పటికీ నాలుగింట ఒక భాగమే పూర్తయింది. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన  రైతులకు కేసీఆర్  ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదు.ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

హామీలు నీటిమూటలు

అప్పట్లో  జూరాల నుంచి కృష్ణానది నీటిని తీసుకొచ్చి లక్ష్మీదేవి పల్లి దగ్గర నిర్మించే  ప్రాజెక్టులో పోసేలా రూపకల్పన చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  దాన్ని రీడిజైన్ చేసి  అదే నీటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల  పేరుతో పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు కింద ఉన్న 8 గ్రామాలు, 4 తండాల ప్రజలు తమ సర్వస్వాన్ని త్యజించి  భూములను ఈ ప్రాజెక్టుకు ఇచ్చారు. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ముంపు  గ్రామాల ప్రజలను  భయానికి  గురిచేసి భూములను తీసుకుంది.భూములు కోల్పోయిన రైతులకు కనీవిని ఎరుగని రీతిలో నష్టపరిహారాన్ని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన  కేసీఆర్ ప్రభుత్వం  మాటలు.. నీటి మూటలే అయ్యాయి.  

హృదయవిదారకం

ప్రత్యేక తెలంగాణలో ప్రతి గుంట భూమి విలువను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న  కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో ఒక ఎకరా రూ.100 కోట్లు పలుకుతుంది అని  డంకా బజాయించి చెబుతున్నది. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన పేదల భూముల ఎకరా విలువ రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలే ఎందుకు ఉంటుంది?  మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురైన వారికి ఎకరాకు రూ.13 లక్షలు ఇచ్చి, తమకు ఇంత తక్కువ ఇవ్వడం ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు.  ఆ పరిహారం కూడా చాలా మంది రైతులకు ఇంకా అందలేదు. నష్టపరిహారంలో కూడా దళారులు, నాయకుల చేతివాటం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.తమ భూములకు భూములు ఇవ్వాలని, లేదంటే మార్కెట్లో భూముల విలువ ఎంతుందో అంత పరిహారం ఇవ్వాలని, లేకపోతే ఈ ప్రాజెక్టు తోనే మునుగుతం అంటున్న  రైతుల గోడు హృదయవిదారకం.

అరణ్య రోదన

నష్టపరిహారం, ఉండడానికి ఇండ్లు ఇవ్వకుండా పూర్తి కానీ ప్రాజెక్టును ఆగమేఘాల మీద ప్రారంభించడం ఏంటని నార్లపురం, ఏదుల, ఉద్దండపురం, వడ్డే గుడిసెలు, సున్నపుతండా, అంజనగిరి ముంపు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.    ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే నాగర్​ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో నష్టపరిహారం రాక ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం నిర్వాసితుల సమస్య తీవ్రతను తెలుపుతున్నది . ప్రత్యేక తెలంగాణలో కూడా పరిహారం కోసం  రైతులు బలి కావాల్సిందేనా ? అందరూ ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.

- డా. మండ్ల రవి