- విదర్భ 31/3
ముంబై: విదర్భ, ముంబై జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ ఆదివారం ఆసక్తికరంగా మొదలైంది. ఇరు జట్లూ బ్యాటింగ్‌లో తడబడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 224 రన్స్‌కు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (69 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 75) ఫిఫ్టీతో రాణించారు. ఓపెనర్లు పృథ్వీ షా (43), భూపేన్ లల్వాని (37) తొలి వికెట్‌కు 81 రన్స్ జోడించి మంచి ఆరంభమే ఇచ్చినా తర్వాత ముంబై బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఈ ఇద్దరితో పాటు ముషీర్ ఖాన్ (6), కెప్టెన్ అజింక్యా రహానె (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తమోరె (5), శామ్స్ ములానీ (13) వరుసగా పెవిలియన్ చేరారు.
దాంతో ముంబై 157/7తో కష్టాల్లో పడింది. అయితే, సెమీఫైనల్ హీరో శార్దూల్ ఠాకూర్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. వేగంగా బ్యాటింగ్ చేసిన అతను తనుష్ (8), తుషార్ దేశ్‌పాండే (14) సపోర్ట్‌తో స్కోరు 200 దాటించాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విదర్భ తొలి రోజు చివరకు 31/3 స్కోరుతో నిలిచింది. ధ్రువ్ షోరే (0)ను శార్దూల్ ఔట్ చేయగా, అమన్ మోఖడే (8), కరుణ్ నాయర్ (0)ను ధవళ్ కులకర్ణి పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఓపెనర్ అథర్వ తైడే (21 బ్యాటింగ్), ఆదిత్య ఠాకరే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై స్కోరుకు విదర్భ ఇంకా 193 రన్స్ దూరంలో ఉంది.