న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లేషన్ పెరగడం, వడ్డీ రేట్లు ఎక్కువవ్వడం..ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌ను గందరగోళానికి గురిచేశాయి. కిందటేడాది మార్కెట్‌లో ఎంటర్ అయిన చాలా మంది ఇన్వెస్టర్లు ఈ ఏడాది మార్కెట్ వైపు చూడడానికి కూడా భయపడ్డారు. కానీ, రిస్క్ తీసుకుంటే ధనలక్ష్మి వరిస్తుందనే సామెత ఒక షేరుకి మాత్రం బాగా సరిపోతుంది. రిస్క్ తీసుకోవడం కంటే గుడ్డిగా ఒక షేరును నమ్మి ఉంటే ఏడాదిలోనే రూ. లక్షాధికారి అయ్యేవారు. బొగ్గు సప్లయ్ చేసే ఒక కంపెనీ ఈ ఏడాది ఏర్పడిన కరెంట్ క్రైసిస్‌తో 2,500 శాతం వరకు పెరిగింది. హేమాంగ్ రిసోర్స్ లిమిటెడ్ (గతంలో భాటియా ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) షేరు ఈ ఏడాది ప్రారంభంలో రూ.3 దగ్గర ఉండగా, మే నెలలో రూ.80 కి చేరుకుంది. అంటే రూ. లక్ష ఇన్వెస్ట్‌మెంట్ మే నెలలోనే రూ. 25 లక్షలయ్యేది.
బొగ్గుకు ఫుల్ డిమాండ్.. కలిసొచ్చిన కాలం
విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకొని లోకల్‌గా ఈ బొగ్గును హేమాంగ్ రిసోర్సెస్ అమ్ముతోంది. అంతేకాకుండా షిప్‌లలో కార్గోను నింపడం, దించడం వంటి సర్వీస్‌లను కూడా అందిస్తోంది. సాధారణంగా పెన్నీ షేర్లు పెద్దగా లాభాలను ఇవ్వవు. కానీ, హేమాంగ్ రిసోర్సెస్ షేరు పెరగడానికి బలమైన కారణం ఉంది. ఈ కంపెనీ రెవెన్యూ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.155.53 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.19.52 కోట్లకు ఎగిసింది. అంతకుముందు ఏడాదిలోని ఏప్రిల్–సెప్టెంబర్ టైమ్‌లో కంపెనీ రెవెన్యూ సున్నా. ఇంకా రూ. 5 లక్షల నష్టం కూడా వచ్చింది. ఈ ఏడాది సమ్మర్ టైమ్‌లో కరెంట్ డిమాండ్ భారీగా పెరిగింది. లోకల్‌గా బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఎన్‌టీపీసీ లాంటి పెద్ద కంపెనీలు దిగుమతులపై ఆధారపడడం పెంచాయి. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్య దేశ బొగ్గు దిగుమతులు 38.84 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. మొత్తం 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే దేశ బొగ్గు దిగుమతులకు అయ్యే ఖర్చు 35 శాతం పెరుగుతుందని అంచనా. పవర్ క్రైసిస్ హేమాంగ్ రిసోర్సెస్‌కు వరంలాగా మారింది. ఈ కంపెనీ షేరు పెరగడానికి ఇదొక కారణమని ఎనలిస్టులు పేర్కొన్నారు. కానీ, ఇదొక్క కారణంతోనే షేరు ఇంతలా పెరిగి ఉండదని చెబుతున్నారు. సాధారణంగా పెన్నీ షేర్లు వోలటాలిటీగా ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఫలితంగా కొంత మంది బలమైన ఇన్వెస్టర్లు షేర్ల ధరలను మానిప్యులేట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువలన ఇన్వెస్టర్లు పెన్నీ షేర్లలో డబ్బులు పెట్టేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.