- ఇండియా కూటమి శాసనసభా పక్ష నేతగా ఎంపిక
- గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్‌తో సోరెన్ భేటీ
- కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖ అందజేత
రాంచీ: జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. ఈ నెల 28న జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ఇన్‌చార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, పార్టీ సీనియర్ నాయకుడు రాజేశ్ ఠాకూర్ కూడా సంకీర్ణ పార్టీల శాసనసభ్యులతో పాటు సమావేశానికి అటెండ్ అయ్యారు.
హేమంత్ సోరెన్‌ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం తన కారులో రాజ్‌భవన్‌కు చేరుకున్న సోరెన్.. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్‌తో భేటీ అయ్యారు. తన సీఎం పదవికి రాజీనామా చేసి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సోరెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని గవర్నర్ ఆహ్వానించారు. ఈ నెల 28న ప్రమాణ స్వీకారం ఉంటుంది. అప్పటివరకూ తాత్కాలిక సీఎంగా వ్యవహరించాలని నన్ను గవర్నర్ కోరారు’ అని తెలిపారు.
14వ సీఎంగా హేమంత్ సోరెన్
శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. జేఎంఎం కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. 81 మంది శాసనసభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి 56 సీట్లలో విజయం సాధించింది. ఈ కూటమిలోని జేఎంఎం 34, కాంగ్రెస్16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) 2 స్థానాల్లో గెలిచాయి. ఎన్డీయే కూటమి 24 సీట్లతోనే సరిపెట్టుకున్నది. బీజేపీ 21, జేడీయూ 1, ఏజేఎస్‌యూపీ 1, ఎల్జేపీఆర్వీ 1 చోట మాత్రమే విజయం సాధించాయి. బర్హయిత్ నుంచి బరిలోకి దిగిన హేమంత్.. బీజేపీ అభ్యర్థి గామ్లియెల్హెంబ్రోమ్పై 39,791 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇండియా కూటమి ఎమ్మెల్యేలు ఆయనను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకోవడంతో ఆ రాష్ట్ర 14వ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. జార్ఖండ్ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత వరుసగా రెండోసారి ఒకే ప్రభుత్వం ఏర్పడడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రభుత్వం మారగా ఇప్పుడు ఇండియా కూటమికే ప్రజలు వరుసగా రెండోసారి పట్టంగట్టారు. అలాగే, వరుసగా రెండోసారి సీఎంగా ఎన్నికైన తొలి నేతగా హేమంత్ సోరెన్ రికార్డు సృష్టించనున్నారు.