ఇండియా కూటమికే జార్ఖండ్​ జై.. హేమంత్ సోరెన్​రికార్డు

ఇండియా కూటమికే జార్ఖండ్​ జై.. హేమంత్ సోరెన్​రికార్డు
  • స్పష్టమైన మెజార్టీ సాధించిన జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం
  • 81 స్థానాలకు 56 సీట్లలో హవా
  • జేఎంఎంకు 34,కాంగ్రెస్​కు 16, ఆర్జేడీకి 4, 
  • సీపీఐ (ఎంఎల్) (ఎల్)కు 2 24  సీట్లతో సరిపెట్టుకున్న 
  • ఎన్డీయే కూటమి.. 21 స్థానాల్లో బీజేపీ గెలుపు
  • ఎల్​జేపీఆర్వీ, ఏజేఎస్ ​యూపీ, జేడీయూ ఒక్కో స్థానంలో విజయం
  • ఒక స్థానంలో విజయం సాధించిన జేఎల్​కేఎం
  • ఆదివాసీ కంచుకోటలో హేమంత్ సోరెన్​ రికార్డు
  • 24 ఏండ్లలో తొలిసారి వరుసగా అధికారం

రాంచీ:జార్ఖండ్​లో ఎగ్జిట్​ పోల్స్​ను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి సత్తా చాటింది. ఎన్డీయే కూటమి ఆశలకు గండి కొడుతూ మళ్లీ జేఎంఎం నేతృత్వంలోని కూటమి మ్యాజిక్​ ఫిగర్​ను దాటింది. ఆదివాసీ కోటలో హేమంత్​ సోరెన్​ ఆధ్వర్యంలోని జేఎంఎం సంకీర్ణ సర్కారు మళ్లీ కొలువుదీరనున్నది.  

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేరాఫ్‌‌‌‌గా నిలిచిన రాష్ట్రంలో.. మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నది.ఇక్కడ 24 ఏండ్ల రికార్డును బ్రేక్ చేసి మళ్లీ అధికార కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. 

రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ  అధికారం దక్కాలంటే మ్యాజిక్​ ఫిగర్​41 కాగా, ఇండియా కూటమి 56 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇందులో జేఎంఎం 34 సీట్లలో సత్తా చాటగా, కాంగ్రెస్​ 16, ఆర్జేడీ 4 , సీపీఐ(ఎంఎల్​) 2 చోట్ల జయకేతనం ఎగురవేశాయి.

 ఇక ఎన్డీయే కూటమి 24 సీట్లతో సరిపెట్టుకున్నది. ఈ కూటమిలోని బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. ఏజేఎస్​యూపీ , ఎల్​జేపీఆర్వీ, జేడీయూ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. జార్ఖండ్​లోక్​తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్​కేఎం) ఒక స్థానంలో విజయం సాధించింది. 

ఆదినుంచీ లీడ్​లో ఇండియా కూటమి

శనివారం ఉదయం 8 గంటలకు నిఘా నీడలో కౌంటింగ్​ ప్రారంభమైంది. మొదట పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను లెక్కించారు. అనంతరం జనరల్​ ఓట్లను కౌంట్​ చేశారు. ఆదినుంచీ ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

 బర్హయిత్​ అసెంబ్లీ స్థానంనుంచి బరిలోకి దిగి సీఎం హేమంత్​ సోరెన్​.. బీజేపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌‌‌‌పై  39,791 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సోరెన్​కు 95,612 ఓట్లు రాగా, హెంబ్రోమ్​కు 55,821 ఓట్లు వచ్చాయి. 

గాండేయ్​ నియోజకవర్గంలో హేమంత్​ సోరెన్​ భార్య కల్పనా సోరెన్​ విజయకేతనం ఎగురవేశారు. బీజేపీకి చెందిన మునియా దేవిపై ఆమె 17,142 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  సరాయికేలా నుంచి బరిలో నిలిచిన మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి చంపయీ సోరెన్.. జేఎంఎంకు చెందిన గణేశ్​మహాలీపై గెలుపొందారు. 

సీఎం హేమంత్​ సోరెన్​ వదిన సీతా సోరెన్.. కాంగ్రెస్​కు చెందిన ఇర్ఫాన్​ అన్సారీ చేతిలో ఓటమిపాలయ్యారు. ​ధన్వార్​ నియోజకవర్గంలో జేఎంఎం అభ్యర్థి నిజాముద్దీన్​ అన్సారీపై బీజేపీ రాష్ట్ర చీఫ్​ బాబులాల్​ మరాండీ విజయం సాధించారు.  

చనదన్​కియరి నుంచి పోటీకి దిగిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత (బీజేపీ) అమర్​ కుమార్​ బౌరీ మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ జేఎంఎంకు చెందిన ఉమాకాంత్​ రజక్​ విజయం సాధించారు. జంషెడ్​పూర్​ వెస్ట్  నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్​ మంత్రి బన్నా గుప్తా .. జేడీయూకు చెందిన సర్యూ రాయ్​చేతిలో ఓటమి పాలయ్యారు. 

నాలా నియోజకవర్గంలో స్పీకర్​ రబీంద్ర నాథ్​ మహతో గెలుపొందారు.  మహగామాలో కాంగ్రెస్​కు చెందిన దీపికా పాండే సింగ్​తన సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన అశోక్​కుమార్​పై విజయం సాధించారు.

సవాళ్లు ఎదురైనా హిట్​ కొట్టిన సోరెన్​ దంపతులు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్​​ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ భూవివాదానికి సంబంధించి మనీలాండరింగ్​ కేసులో హేమంత్​ సోరెన్​ జైలుకెళ్లారు. అనంతరం చంపయీ సోరెన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.  

హేమంత్​ సోరెన్​ భార్య కల్పనా సోరెన్​ పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. అదే టైంలో గాండేయ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బైపోల్​లో గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆమె విజయం సాధించారు. హేమంత్​ సోరెన్​ జైలునుంచి తిరిగొచ్చాక చంపయీ సోరెన్ పదవి వీడాల్సి వచ్చింది. 

దీంతో అలకబూనిన చంపయీ సోరెన్, హేమంత్​ సోరెన్​ వదిన సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ​ఆదివాసీ ప్రాంతాల్లో చంపయీ సోరెన్​కు ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం–కాంగ్రెస్​ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించిన ఎన్డీయే కూటమికి పరాభవమే ఎదురైంది. బీజేపీ బంటీ ఔర్​ బబ్లీగా పిలిచిన హేమంత్​ సోరెన్​, కల్పనా సోరెన్​ దంపతులు దాదాపు 200 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. 

జేఎంఎం నేతృత్వంలోని కూటమిపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పార్టీకి ప్రజల్లో ఆదరణ లభించేలా చేశారు. ప్రతి సభలో బీజేపీ విధానాలను ఎండగడుతూ.. సోరెన్​ అరెస్ట్​పై ఆదివాసీల్లో సింపతీ వచ్చేలా చేశారు.  

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, బీజేపీ అధ్యక్షుడు నడ్డాలాంటి మహామహులు  బీజేపీ తరఫున ప్రచారం చేసినా.. ఇండియా కూటమి జార్ఖండ్​లో మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేసి, సూపర్​హిట్​ జోడీగా నిలిచారు. 

సంక్షేమం, గిరిజనమే గెలిపించింది.

జేఎంఎం నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి సంక్షేమం, గిరిజనమే హేమంత్​ సోరెన్​కు అస్త్రాలుగా పనిచేశాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ టాప్ మోస్ట్​ లీడర్లంతా జార్ఖండ్​లో ప్రచారం చేశారు. బంగ్లాదేశ్​ అక్రమ వలసలను జేఎంఎం ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఇక్కడి గిరిజనుల హక్కులను హరిస్తున్నదని ప్రచారం చేశారు. హేమంత్​ సోరెన్​ను అవినీతిపరుడని, జైలుకెళ్లి వచ్చాడంటూ విమర్శించారు. 

అయితే, సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంటును నమ్ముకున్న సోరెన్‌‌‌‌ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది. హేమంత్‌‌‌‌ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం.. ఆదివాసీ సెంటిమెంటును తమవైపు తిప్పుకున్నది. అలాగే,  ముఖ్యమంత్రి ‘మైయా సమ్మాన్‌‌‌‌ యోజన’ పేరుతో మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇచ్చే పథకాన్ని సోరెన్​ ప్రధానాస్త్రంగా వాడుకున్నారు.

 ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. ‘సర్నా’ను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా జేఎంఎం కూటమికి కలిసొచ్చినట్టు కనిపిస్తున్నది.  ‘ఆప్​కే అధికార్​.. ఆప్​కీ సర్కార్​, ఆప్ కే ద్వార్​స్కీమ్’​ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకురావడం, బకాయి విద్యుత్​ బిల్లుల మాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​,  1.75 లక్షల రైతులకు ప్రయోజనం చేకూర్చే రుణమాఫీ లాంటివి ఓటర్లు జేఎంఎంవైపు ఆకర్షితులయ్యేలా చేశాయి. అలాగే, బీజేపీకి అవకాశం ఇస్తే అడవులపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందని జేఎంఎం చేసిన ప్రచారం ప్లస్​ అయినట్టు ఫలితాలను బట్టి తెలుస్తున్నది.

ఆదివాసీల గొంతుగా హేమంత్​ సోరెన్​

జార్ఖండ్‌‌‌‌ రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాకారం చేసిన శిబు సోరెన్‌‌‌‌ వారసుడిగా  హేమంత్‌‌‌‌ సోరెన్‌‌‌‌ (49) రాజకీయాల్లో అరంగేట్రం చేశారు.   1975 ఆగస్టు10న బిహార్‌‌‌‌లోని రామ్‌‌‌‌ఘర్ జిల్లాలో (ప్రస్తుత జార్ఖండ్) ఉన్న నెమారాలో శిబు సోరెన్, రూపి సోరెన్ దంపతులకు హేమంత్​ జన్మించారు.  

పాట్నాలోని పాట్నా హైస్కూల్‌‌‌‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు.  రాంచీ మెస్నాలోని బిర్లా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌‌‌‌లో చేరిన ఆయన మధ్యలో చదువు మానేశారు.  2009లో రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 

అదే సంవత్సరం బర్హయిత్​ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి,  శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2010 సెప్టెంబర్​ నుంచి 2013 జనవరి వరకు జార్ఖండ్​ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2013 జూలైలో కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

38 ఏండ్లకే సీఎం అయిన అతి చిన్నవయస్కుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు. 2015-–2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆదీవాసీల గొంతుకగా నిలిచారు. స్థానిక ఆదివాసీలకు నష్టం చేసేలా పాలక ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, సవరణలను వ్యతిరేకించారు. 

దీంతో హేమంత్​ సోరెన్​కు ఆదివాసీ ప్రజల్లో మంచి ప్రజాదరణ లభించింది. దీంతో 2019లో కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో మరోసారి సీఎం ఆఫీసులో అడుగుపెట్టారు.  అయితే, 2023లో ఓ భూవివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. జార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేయగా, విడుదలయ్యారు. అనంతరం మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు.

జార్ఖండ్ ఓట్ షేర్

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలో 81 స్థానాలు ఉండగా ఇండియా కూటమి 56కి పైగా, ఎన్డీఏ కూటమి 24కు పైగా స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.