సాగు నీళ్లు విడుదల చేయాలని ధర్నా

సాగు నీళ్లు విడుదల చేయాలని ధర్నా

ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండి పోతున్నాయని, వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం హేమంత రావు డిమాండ్​ చేశారు. ఈ విషయమై శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పాత ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యనిర్వహక ఇంజినీర్ ఆఫీస్ ఎదుట లీడర్లు ధర్నా చేశారు.

అంతకుముందు సీపీఐ పార్టీ ఆఫీస్ నుంచి నీటి పారుదల శాఖ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ 20 రోజుల కంద సాగర్ కాల్వకు గండి పడితే అధికారులు నిర్లక్ష్యంతో ఇంకా గండి పూడ్చలేదన్నారు.

దీంతో జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న రెండున్నర లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం నుంచి నీళ్లు విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాబూరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేశ్, కొండ పర్తీ గోవిందరావు పాల్గొన్నారు. 

కల్లూర్ లో​బీఆర్ఎస్ ఆందోళన

కల్లూరు : కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో జల వనరుల శాఖ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మాజీ జడ్పీటీసీ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాలెపు రామారావు, లక్కినేని రఘు మాట్లాడుతూ ఎన్ఎస్పీ డివిజన్ పరిధిలో సాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. వెంటను సాగర్​ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద బోయినమల్లేశ్వరరావు, కాటమనేని వెంకటేశ్వరరావు, మేకల కృష్ణ, పెడకంటి రామకృష్ణ, జక్కంపూడి కిషోర్, వల్లభనేని రవికుమార్ తదితరులు 
పాల్గొన్నారు.