సాంప్రదాయ వైద్య అభ్యాసకుడు హేమచంద్ మాంఝీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. తనకు నక్సలైట్ల నుంచి బెదిరింపులు వస్తుండటంతో అవార్డును తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. మే 27న తనకు నక్సలైట్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా ఆయన తెలిపారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత పద్మశ్రీ అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు హేమచంద్ తెలిపారు.
అంతేకాకుండా వైద్యరాజ్‌గా ప్రసిద్ధి చెందిన మాంఝీ తన అభ్యాసాన్ని కూడా విరమించుకుంటానని చెప్పారు. గతంలో తన మేనకోడలు కోమల్ మాంఝీపై తప్పుడు ఆరోపణలు చేసి నక్సలైట్లు హత్య చేశారని.. అప్పటినుంచి తన కుటుంబం భయం నీడలో బతుకుతున్నామని ఆయన చెప్పారు. నక్సలైట్ల బెదిరింపుల క్రమంలో ప్రస్తుతం హేమచంద్ కుటుంబానికి స్థానిక పోలీసులు భద్రత కల్పించారు.
తాను చేసిన సేవలకు పద్మశ్రీ అక్కర్లేదని... తనకు ఓ ఇంటిని అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు హేమచంద్ మాంఝీ, 72 ఏళ్ల మాంఝీ ఐదు దశాబ్దాలకు పైగా ఛత్తీస్‌గఢ్ లోని ప్రజలకు సాంప్రదాయ ఆరోగ్య సేవలను అందించారు. ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.