హైదరాబాద్ ఇక మనదే

హైదరాబాద్ ఇక మనదే
  •     ముగిసిన పదేండ్ల ఉమ్మడి రాజధాని గడువు  
  •     సిటీలోని భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే.. 

హైదరాబాద్, వెలుగు : ఇకపై హైదరాబాద్ మన రాష్ట్రానికే రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్‌‌‌‌ పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు ఈ నెల 1తో ముగిసింది. దీంతో ఎలాంటి విభజన సమస్యలు లేని హైదరాబాద్​లోని భవనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే చెందనున్నాయి. తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్ పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే 2016–17లోనే ఏపీ ప్రభుత్వం తమ కార్యాలయాలను చాలా వరకు ఆంధ్రప్రదేశ్​కు తరలించింది. 

అప్పటి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రెండు ప్రభుత్వాలతో మాట్లాడి.. ఏపీ ఆధీనంలో ఉన్న కొన్ని భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన వాటిలో 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యే క్వార్టర్లు, లేక్‌‌వ్యూ అతిథి గృహం, సీఐడీ హెడ్‌‌క్వార్టర్స్‌‌ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉండగా, ఇప్పుడు అవన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. 

హైదరాబాద్‌‌లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకు చెందనున్నాయి. కాగా, హైదరాబాద్​లోని కొన్ని భవనాలను ఇంకొంతకాలం కంటిన్యూ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్​లో ఉన్నందున పునర్విజన చట్టాన్ని సవరించి, ఇంకొంత కాలం టైమ్ ఇవ్వాలని ఏపీ కోరినట్లు తెలుస్తున్నది.