కమ్మటి ఫుడ్​ ఐటమ్స్​కు కేరాఫ్​ అడ్రస్​ ‘నెస్లే’

 కమ్మటి ఫుడ్​ ఐటమ్స్​కు కేరాఫ్​ అడ్రస్​ ‘నెస్లే’

నోరూరించే తియ్యతియ్యటి చాక్లెట్స్​.. బాగా ఆకలేసినప్పుడు రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే నూడుల్స్​... వీటికి తోడు చల్లటి కూల్​డ్రింక్స్​, ఐస్​క్రీమ్స్​.. ఒక్కటేమిటి కడుపునింపే కమ్మటి ఫుడ్​ ఐటమ్స్​కు కేరాఫ్​ అడ్రస్​ ‘నెస్లే’. కానీ, వీటన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం.. చిన్నారుల బొజ్జల్లో ఆకలి తీర్చి, వాళ్ల ప్రాణాలు కాపాడిన ఒక ‘అమృతం’ గురించి. దాన్ని తయారుచేసింది ‘హెన్రీ నెస్లే’. కొన్నేండ్ల కిందట కొన్ని కోట్ల మంది చిన్నారులు బతకడానికి కారణమైన ఆ ప్రాణదాత జీవితమే ఈ వారం మీ కోసం​... 

జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​లో ఆగస్ట్​ 10, 1814లో పుట్టాడు హెన్రీ నెస్లే. తల్లిదండ్రులు జొహాన్​ ఉల్రిచ్​ మథియాస్​ , అనా మరియా కేథరినా ఎహిమన్​. వీళ్లకు మొత్తం14 మంది పిల్లలు.  అందులో హెన్రీ పదకొండవవాడు. హెన్రీ కన్నా ముందు పుట్టినవాళ్లలో ఐదుగురు కొన్ని రోజులకే చనిపోయారు. కారణం.. సరైన పోషకాహారం లేకపోవడం. ఆ తర్వాత పదేండ్లు కూడా బతకకుండానే మరో ఐదుగురు కూడా ఇలాగే చనిపోయారు. చివరికి హెన్రీకి తోడుగా ఇద్దరు అక్కలు, ఒక అన్న మాత్రమే మిగిలారు. పుట్టినపిల్లల్లో ఎక్కువ మంది చనిపోవడంతో హెన్రీ తల్లి ఎప్పుడూ చాలా బాధపడేది. అది హెన్రీ మనసులో నాటుకుపోయింది. 

తండ్రిలాగే కులవృత్తిని కాదనుకొని.. 
నెస్లే ఫ్యామిలీ అప్పట్లోనే మంచి ధనవంతుల కుటుంబం. రెండు మూడు తరాలుగా గ్లేజియర్​ పని చేసేవాళ్లు. అంటే గాజుతో అద్దాలు, సీసాలు, కుండల్లాంటివి తయారుచేసేవాళ్లు. ఈ పనికి మంచి డిమాండ్​ ఉండడంతో హెన్రీ కుటుంబానికి ఆదాయం బాగుండేది. జొహాన్​ కూడా గ్లేజియర్​గా బాగా సంపాదించాడు. అయితే, కొన్నేండ్లకు ఆ పని వద్దనుకున్నాడు. పారిస్ జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలో ఏజెంట్​గా చేరాడు. మరోవైపు హైస్కూలు చదువు పూర్తయ్యాక హెన్రీ కూడా తండ్రిలాగే ఆలోచించాడు. కులవృత్తిని వద్దనుకున్నాడు. ఫార్మసిస్ట్​ కావాలనుకున్నాడు. అయితే, అప్పట్లో కెమిస్ట్రీని సైన్స్​ సబ్జెక్ట్​గా చూసేవాళ్లు కాదు. దానివల్ల యూనివర్సిటీలు, కాలేజీల్లో ఫార్మసీ కోర్సులు లేవు. దాంతో ప్రైవేటుగా ఫార్మసీ థియరీలో అప్రెంటిస్​​ చేశాడు. ఇక ఫార్మసిస్ట్​ కావడం ఒకటే మిగిలింది. దానికోసం ప్రాక్టీస్​ ఉండాలి. ఆ పనిమీద స్విట్జర్లాండ్​లోని ‘వెవే’ సిటీకి చేరాడు. 

ఫార్మసిస్ట్​ అసిస్టెంట్​గా..
‘వెవే’ ఫ్రెంచ్​వాళ్లు ఎక్కువగా ఉండే సిటీ. అక్కడ ఫ్రెంచ్​ భాషే ఎక్కువ వాడుకలో ఉంటుంది. అక్కడి ఒక ఫార్మసిస్ట్​ దగ్గర 1839లో అసిస్టెంట్​గా చేరాడు హెన్రీ. అప్పటికి అతనికి 25 ఏండ్లు.  1938లో తండ్రి చనిపోయాడు. సంవత్సరం తర్వాత తల్లి చనిపోయింది. దాంతో తిరిగి జర్మనీకి వెళ్లకుండా ‘వెవే’​లోనే ఉండిపోవాలనుకున్నాడు హెన్రీ. అదే టైంలో అతనికి ఫార్మసిస్ట్​గా మందులు తయారుచేయడానికి, వాటిని అమ్మడానికి స్విట్జర్లాండ్​ ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. 

బిజినెస్​లోకి..
ఫార్మసిస్ట్​గా పనిచేస్తూనే ఏదైనా బిజినెస్​ చేయాలనుకున్నాడు హెన్రీ. అప్పుడే అతనికి ‘ఎన్​ రువాంజ్​’ గురించి తెలిసింది. అదొక అటాచ్డ్​ రెసిడెన్షియల్​ బిల్డింగ్ ఉన్న పెద్ద ప్రాపర్టీ. దాని​ ఆవరణలోనే ఆయిల్​ మిల్​, ప్రెస్​, సా మిల్​, డిస్టిలరీ, కొన్ని షెడ్స్​, పెరడుతోపాటు కావల్సిన సౌకర్యాలు ఉంటాయి. అయితే, ఈ ప్రాపర్టీ కొనడానికి సరిపోయేంత డబ్బు హెన్రీ దగ్గర లేదు. దాంతో ఫ్రాంక్​ఫర్ట్​కు వెళ్లి మేనత్త అనా దొరొతియా దగ్గర అప్పు తీసుకున్నాడు. మరొక స్నేహితుడు పార్ట్​నర్​గా రావడంతో ఎన్​ రువాంజ్​లో బిజినెస్​ మొదలుపెట్టాడు. వెనిగర్​, ఫ్రూట్​ బ్రాందీలు, మినరల్​ వాటర్, నిమ్మరసాలు, ఎరువులు వంటివి తయారుచేయడం మొదలుపెట్టాడు. దానికోసం కొంతమంది పనివాళ్లను పెట్టుకొన్నాడు. మరోవైపు ఫార్మసిస్ట్​గా ఫుల్​ సక్సెస్​ అయ్యాడు హెన్రీ.1860లో అనా క్లెమెంటిన్​ థెరిసాను పెండ్లి చేసుకున్నాడు. 

చిన్నపిల్లల సంజీవని..
పెండ్లికి ముందే థెరిసా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేది. దానికితోడు పిల్లలు పుట్టలేదు. అందుకే స్నేహితుల పిల్లల్ని, ఫ్యాక్టరీలోని వర్కర్ల పిల్లల్ని చాలా బాగా చూసుకునేది. ఎమ్మా సీలర్​ అనే అనాథ బాలికను దత్తత తీసుకున్నారు హెన్రీ, థెరిసా. మరోవైపు బిజినెస్​లో తగిన ఆదాయం రాకపోవడం, తరచూ ఇబ్బందులు వస్తుండడంతో హెన్రీకి అప్పులు పెరిగిపోయాయి. అదే టైంలో బిజినెస్​ పార్ట్​నర్​ తన వాటా తీసుకొని వెళ్లిపోయాడు. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న హెన్రీకి తన చిన్నప్పుడు తల్లి అనుభవించిన బాధ గుర్తొచ్చింది. పిల్లలు చనిపోవడంతో ఏండ్లపాటు ఆమె పడిన బాధ కళ్ల ముందు కదిలింది. అప్పట్లో చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఆ సమస్య తీరేలా కొత్త బిజినెస్​ చేయాలనుకున్నాడు. సరైన పోషకాహారం లేకనే చిన్నారులు చనిపోతున్నారని తెలుసుకున్నాడు. వెంటనే తన ల్యాబ్​లో ప్రయోగాలు మొదలుపెట్టాడు. దానికోసం కొంతమంది సైంటిస్ట్​ల సాయం తీసుకున్నాడు. చివరికి చిన్నపిల్లల కోసం పాలు, గోధుమ పిండి, చక్కెరతో ‘ఫెరైన్​ లాక్టీ’ అనే పదార్థం తయారుచేశాడు. అమ్మపాలు దొరకని, తల్లులు చనిపోయిన చిన్నారులకు సంజీవనిలా మారింది ఇది. కొద్ది రోజుల్లోనే ‘ఫెరైన్​ లాక్టీ’కి దేశంలోని అన్ని చోట్లా డిమాండ్​ పెరిగిపోయింది. దాంతో 1866లో ‘నెస్లే’ కంపెనీ మొదలైంది.  

పోటీ కంపెనీతో కలిసిపోయి
‘ఫెరైన్​ లాక్టీ’కి యూరప్​తోపాటు విదేశాల్లోనూ ఫుల్​ డిమాండ్​ వచ్చింది. దాంతో కంపెనీకి ఆదాయం విపరీతంగా వచ్చింది. అదే టైంలో స్విట్జర్లాండ్​లోనే ‘ఆంగ్లో–స్విస్​’ కంపెనీతో ‘నెస్లే’ పోటీ పడింది. ఆంగ్లో–స్విస్​ కంపెనీని ఇద్దరు అమెరికన్​ బ్రదర్స్​ పెట్టారు. ఈ కంపెనీ చిన్నపిల్లల కోసం ‘కండెన్స్​డ్​ మిల్క్​’ తయారుచేసేది. ఇది కూడా మార్కెట్​లో బాగానే అమ్ముడయ్యేది. అయితే, ‘ఫెరైన్​ లాక్టీ’ వచ్చాక దీని సేల్స్​ తగ్గడం మొదలైంది. దీంతో వాళ్లు కూడా ‘ఫెరైన్​ లాక్టీ’ లాంటి ఫార్ములాతోనే మరొక ప్రొడక్ట్​ మార్కెట్​లోకి తెచ్చారు. వెంటనే ‘నెస్లే’ కూడా కండెన్స్​డ్​ మిల్క్​ తయారుచేయడం మొదలుపెట్టింది. ఈ రెండు కంపెనీల మధ్య పోటీ మొదలైంది. పోటీని తట్టుకునేందుకు బాగా డబ్బు ఇన్వెస్ట్​ చేయాల్సి రావడంతో ‘నెస్లే’ని 1875లో ముగ్గురు లోకల్​ బిజినెస్​మ్యాన్​లకు అమ్మేశాడు హెన్రీ. అయితే, కంపెనీ పేరు, లోగో అలాగే ఉంచాలని కండిషన్​ పెట్టాడు. అంతేకాదు, కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్​పై కొన్నేండ్ల పాటు రాయల్టీ వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 40 ఏండ్ల పాటు నెస్లే, ఆంగ్లో–స్విస్​ కంపెనీ మధ్య పోటీ నడిచింది. చివరికి 1905లో రెండు కంపెనీలు కలిసిపోయి ‘నెస్లే’ బ్రాండ్​ కింద పనిచేయడం మొదలుపెట్టాయి. బ్రాండ్​ ఫుడ్​ ఐటమ్స్​కు కేరాఫ్​ అడ్రస్​గా మారిపోయింది. దాదాపు 186 దేశాల్లో నెస్లే కంపెనీ బ్రాంచ్​లు ఉన్నాయి ఇప్పుడు.  

నెస్లే కుటుంబం జర్మనీలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన స్వాబియా తెగ నుంచి వచ్చింది. ఈ తెగవాళ్లు ఉమ్మడిగా కలసి బతికేందుకు ఇష్టపడతారు. స్వాబియన్​ భాషలో ‘నెస్లే’ అంటే ‘పక్షిగూడు’ అని అర్థం. అందువల్లే హెన్రీ తన కంపెనీకి ‘నెస్లే’ అని పేరు పెట్టాడు. అలాగే లోగోలో ఒక గూడులో పిల్లలకు ఆహారం తినిపిస్తున్న తల్లి పక్షి కనిపిస్తుంది.