కీసర, వెలుగు: ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో 10 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడ ఠాకూర్‌నగర్ లో నివాసముంటున్న శాతనరాం (24), జగదీశ్ (28) కమలేశ్, దినేశ్ కలియన్ రాజస్తాన్ నుంచి హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చారు. ఇక్కడ రేలింగ్ వర్క్ చేస్తూ హెరాయిన్ విక్రయిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్ నుంచి తిరుపతికి కొరియర్ ద్వారా ఓ పార్సిల్ రాగా ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టగా ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి10 గ్రాముల హెరాయిన్, ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఎండీఎంఏ డ్రగ్స్సీజ్
హైదరాబాద్ సిటీ: కొంపల్లిలో ఎండీఎంఏ డ్రగ్స్విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను గణేశ్ నాయక్, రుపుల్ గా గుర్తించి, 4.4 గ్రాముల ఎండీఎంఏ సీజ్‌చేశారు. డ్రగ్స్పెడ్లర్వద్ద ఒక్క గ్రామును రూ. 2 వేలకు కొని రూ. 5వేలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. సీజ్చేసిన డ్రగ్స్‌ను కుత్బుల్లాపూర్ పోలీసులకు అప్పగించి విచారణ జరుపుతున్నారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
అల్వాల్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురుని అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ శంకర్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మచ్చ బొల్లారంలో నివసించే ఫరీద్ అహ్మద్( 21), శ్రీనాథ్ (23), ఖలీల్ అహ్మద్ (20) గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.