నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!

నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!

కల్తీ నెయ్యి, నెయ్యిలో కల్తీ.. ఇటీవల ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇదే. పండుగల సీజన్ వచ్చేసింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఇళ్లలో స్వీటూ, హాటూ వండుకుంటుటారు. ఈ మధ్య టేస్ట్ మరింత బాగుండాలని నూనెతో కంటే నెయ్యితోనే ఎక్కువగా స్వీట్లు చేసుకుంటున్నారు. ఇలా ఇళ్లలో కూడా నెయ్యి వాడకం పెరిగింది. ఈ క్రమంలో అసలు కల్తీ నెయ్యికి, స్వచ్ఛమైన నెయ్యికి తేడా గుర్తించేది ఎలానో తెలుసుకుందాం.. మొత్తం ఐదు రకాలుగా నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అయోడిన్ టెస్ట్, హెచ్సీఎల్ టెస్ట్, అరచేతి టెస్ట్, చక్కెరతో టెస్ట్, మరిగించి టెస్ట్.

అయోడిన్ టెస్ట్: నెయ్యి స్వచ్ఛతను గుర్తించేందుకు అయోడిన్ టెస్ట్ చేయొచ్చు. నెయ్యిలో రెండు టీ స్పూన్ల అయోడైజ్డ్ సాల్ట్ను లేదా కొన్ని చుక్కల అయోడిన్ను గానీ వేయండి. నెయ్యిలో కల్తీ జరిగితే నెయ్యి ఊదా రంగులోకి (Purple) మారుతుంది. నెయ్యి స్వచ్ఛమైందే అయితే నెయ్యి రంగు మారదు.

హెచ్సీఎల్ టెస్ట్: నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకునేందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ టెస్ట్ చేయొచ్చు. 2 ఎంఎల్ నెయ్యిలో 5 ఎంఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను మిక్స్ చేయండి. మిక్స్ చేసిన కొంతసేపటికి నెయ్యి ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు. రంగులో ఎలాంటి మార్పు లేకపోతే నెయ్యి స్వచ్ఛంగా ఉన్నట్లు భావించొచ్చు.

అరచేతి టెస్ట్: ఇది చాలామందికి తెలిసిన టెస్టే. ఎక్కువ మంది నెయ్యి క్వాలిటీ తెలుసుకునేందుకు ఈ పద్ధతినే పాటిస్తుంటారు. అరచేతిలో నెయ్యి వేసుకోండి. నెయ్యి అరచేతిలో వేసుకున్న కొంతసేపటికి కరిగిపోతుంటే ఆ నెయ్యి స్వచ్ఛమైంది. కరిగిపోకుండా చాలా సమయం తీసుకుంటుంటే ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని డిసైడ్ అవ్వొచ్చు.

వంట గదిలో అందరికీ అందుబాటులో ఉండే చక్కెరతో కూడా నెయ్యిని టెస్ట్ చేయొచ్చు. నెయ్యిలో చక్కెరను బాగా మిక్స్ చేసి కొంతసేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత నెయ్యి ఎరుపు రంగులోకి మారితే ఆ నెయ్యిని కల్తీ చేశారని భావించొచ్చు. రంగు మారకపోతే క్వాలిటీ ఘీ అని ఫిక్స్ అవ్వొచ్చు. నెయ్యిని వేడి చేసి కూడా కల్తీ కలిసిందో, లేదో తెలుసుకోవచ్చు. నెయ్యిని బాగా మరిగిస్తే కరిగిపోతూ, గోధుమ రంగులోకి మారుతుంది. అది మంచి నెయ్యి అయితే ఇలా జరుగుతుంది. అదే కల్తీ నెయ్యి అయితే వేడి చేసిన కాసేపటికి కొంత పసుపు రంగులోకి మారుతుంది. అంతేకాదు.. కల్తీ నెయ్యి అయితే వేడి చేసినప్పుడు కరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.