
హైదరాబాద్: బంజారాహిల్స్ టిఎక్స్ హాస్పిటల్ నుంచి మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యాడు. సోమవారం(డిసెంబర్ 9, 2024) మరోసారి ఆస్పత్రికి మనోజ్ వెళ్లనున్నాడు. మంచు మనోజ్కి వైద్యులు మెడికల్ లీగల్ కేసు (MLC) పూర్తి చేశారు. మంచు మనోజ్పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంటర్నల్గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే సిటి స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు పూర్తి చేశారు.
మంచు మనోజ్ ఇంటికి వెళ్లి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. దెబ్బలు ఎలా తగిలాయనేది అడిగి తెలుసుకుని పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. 24 గంటలు పాటు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్పారు. కానీ.. సోమవారం మరోసారి ఆస్పత్రికి వస్తామని మంచు మనోజ్ డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతున్న మంచు మనోజ్ మెడకు పట్టీ పెట్టుకుని కనిపించారు. అయితే ఈ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడేందుకు మంచు మనోజ్ గానీ, అతని భార్య భూమా మౌనిక గానీ ఏమాత్రం సుముఖత చూపకపోవడం గమనార్హం.
మంచు మనోజ్ ఒక స్ట్రాటజీ ప్రకారమే హాస్పిటల్కు వెళ్లాడనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. మనోజ్ హాస్పిటల్కు వెళ్లడం, మెడికల్ లీగల్ కేసు ఫైల్ కావడం ఒక పక్కా స్ట్రాటజీలో భాగమేనని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయితే లీగల్గా మంచు మనోజ్ కేసు స్ట్రాంగ్ అవుతుందని, అందుకే మంచు మనోజ్, భూమా మౌనిక ఇలా ముందుకెళుతుండొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్న మాట.
మంచు మనోజ్ లీగల్ అడ్వైస్ తీసుకుని.. అందుకు తగినట్టుగానే మీడియా ఎదుట కూడా నోరు విప్పడం లేదనే వాదన తెరపైకొచ్చింది. మోహన్ బాబు గానీ, మంచు మనోజ్ గానీ అసలు గొడవ ఏంటనే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో రకరకాల ప్రచారాలు, పుకార్లు మీడియాలో, సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలపై ఆ కుటుంబం నుంచి వివరణ వస్తే గానీ అసలు ఏం జరిగిందనే విషయంలో స్పష్టత వచ్చేలా లేదు.