- లక్షలాది మంది పాల్గొనే ఏకైక రథయాత్ర
- 10 రోజుల పాటు జరిగే పండుగ
- ప్రపంచంలోనే అతి ప్రాచీణమైన రథయాత్రగా పేరు
- చరిత్రలో మొదటిసారి భక్తులు లేకుండా రథయాత్ర
పూరీ: జగన్నాథ రథయాత్ర.. ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర. ఒడిశాలోని పూరీలో ఏటా ఎంతో వైభవంగా దీన్ని నిర్వహిస్తారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా భక్తులు ఎవరూ లేకుండా ఈ రథయాత్ర నిర్వహిస్తున్నారు. భక్తులు లేకుండా కేవలం పూజార్లు మాత్రమే నిర్వహించడం చరిత్రలే ఇదే మొదటిసారి అని టెంపుల్ వర్గాలు చెప్పాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని, అందుకే భక్తులు లేకుండా నిర్వహించాలని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని ఈసారి నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగానే పూరీలో అధికారులు కర్ఫ్యూ పెట్టారు. రథాన్ని లాగే 700 మంది పూజార్లకు కరోనా టెస్టులు కూడా నిర్వహించింది. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం కేవలం పూరీలోనే ఈ రథయాత్రను నిర్వహిస్తున్నారు. జగన్నాథుని యాత్రం సందర్భంగా ప్రధాని మోడీ ఒడిశా ప్రజలకు శభాకాంక్షలు చెప్పారు. అందరికీ మంచి ఆరోగ్యం, మంచి జరిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలను ఆ రాష్ట్ర సీఎం నవీన్‌పట్నాయక్ ట్వీట్ చేశారు.
లక్షలాది మంది పాల్గొనే అతిపెద్ద రథయాత్ర
ఏటా ఆషాఢమాసం మొదలైన రెండో రోజు ప్రారంభమయ్యే పూరీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం 10 రోజుల పాటు కొనసాగుతుంది. పది రోజులు పాటు జరిగే ఈ రథయాత్రలో లక్షలాది మంది పాల్గొంటారు. ఇంత మంది పాల్గొనే ఏకైక రథయాత్రగా దీనికి రికార్డ్ ఉంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా దీనికి పేరు ఉంది. వేదాల ప్రకారం 12వ శతాబ్దంలో దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
రథయాత్ర వెనుక చరిత్ర
ఆషాఢమాసంలో రెండో రోజు మొదలయ్యే ఈ వేడుక 10 – 12 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది 23న ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సంబంధించి సహజంగా మూడు ఇతిహాసాలు ఉన్నాయి. వాటిలో మొదటిది జగన్నాథుడు (కృష్ణుడు) తన మామ కంసుడిని చంపేందుకు బృందావనం నుంచి మధుర వరకు చేసే ప్రయాణం అని అంటారు. రెండోది తన తోబుట్టువులు సుభద్ర, బలరాములు జ్వరం నుంచి కోలుకుని అత్త గుండిచాను చూసేందుకు వెళ్లడం అని చెప్తారు. కృష్ణుడు తన భక్తులను కలిసేందుకు తోబుట్టువులైన సుభద్ర, బలరాములతో కలిసి బయటికి వస్తారు అని కూడా నమ్ముతారు.
రథయాత్రలో అసలు ఏం చేస్తారు?
పూరీలోని జగన్నాథ ఆలయంలో నిత్యం పూజలు అందుకునే జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలను ఏడాదికి ఒకసారి ఆలయం నుంచి బయటికి తీసుకస్తారు. ప్రత్యేక పూజలు చేసి సుదర్శన చక్రాలు ఉన్న భారీ రథాల్లో ఉంచుతారు. అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి అత్తగారి ఇల్లుగా చెప్పే గుడించా ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ దాదాపు 9 రోజులు ఉంచి.. ప్రత్యేక పూజలు చేస్తారు. 10వ రోజు మళ్లీ రిటర్న్ జర్నీ ఉంటుంది. జగన్నాథుడిని ఉంచే రథాన్ని నందిఘోషా అంటారు. 18 చక్రాలు, 45.6 అడుగుల ఎత్తు ఉంటుంది. బలరాముడిని తీసుకొచ్చే రథాన్ని తలాద్‌వాజా అంటారు. దానికి 16 చక్రాలు ఉండగా.. 45 అడుగుల ఎత్తు ఉంటుంది. సుభద్ర వెళ్లే రథాన్ని దేవదలానా అంటారు. దీనికి 14 చక్రాలు ఉండగా.. 44.6 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిని ఏటా కొత్తవి తయారు చేస్తారు. ప్రత్యేక రకమైన చెట్టుతోనే దీన్ని చేస్తారు.