చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్

చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్
  • చార్మినార్  వద్ద హెరిటేజ్  వాక్
  • అందాల పోటీల ప్రారంభానికి ముందు నిర్వహిస్తాం
  • టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్  వెల్లడి
  • స్వాగత ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో త్వరలో జరిగే అందాల పోటీల కార్యక్రమానికి ముందు చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్  డిన్నర్  ఉంటుందని, తర్వాత చార్మినార్  వద్ద హెరిటేజ్ వాక్  నిర్వహిస్తామని టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్  తెలిపారు. తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా అందాల పోటీలు నిర్వహిస్తామన్నారు. 

మిస్​వర్డల్​ పోటీలు, వివిధ దేశాల నుంచి వచ్చే మోడల్స్, పర్యాటకుల స్వాగత ఏర్పాట్లపై మంగళవారం చౌమొహల్లా ప్యాలెస్​లో అధికారులతో ఆమె రివ్యూ మీటింగ్  నిర్వహించారు. స్మిత మాట్లాడుతూ అందాల పోటీలతో తెలంగాణ టూరిజం బ్రాండ్  పెరిగేలా చూస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మే 7  నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్  పోటీలు  నిర్వహిస్తామని చెప్పారు. 

ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన మోడల్స్  పాల్గొంటారని వెల్లడించారు. మోడల్స్ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. 

ప్యాలెస్ లో ఫొటోషూట్  కోసం సీటింగ్  ఏర్పాట్లు, లైవ్  మ్యూజిక్  కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్,  కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వెల్కం డిన్నర్ ఉంటుందని, నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెనూలో ఉంటాయన్నారు.