హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లాడు. ముందస్తు సమాచారం లేకుండా వెళ్లడం, థియేటర్ యాజమాన్యం కూడా భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • అల్లు అర్జున్ ను ఎంక్వయిరీ చేస్తున్న పోలీసులు
  • సంధ్య థియేటర్ ఘటనలో ఎంక్వైరీ
  • పోలీసులు అల్లు అర్జున్ ను తీసుకెళ్తున్నారు
  • చిక్కడపల్లి పిఎస్ కి తరలింపు
సంధ్య థియేటర్ దగ్గర ఆ రోజు ఏం జరిగిందంటే..
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 2024, డిసెంబర్ 5న గ్రాండ్‎గా విడుదలైంది. రిలీజ్‎కు ఒకరోజు ముందే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు పలు చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ఇందులో భాగంగానే ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‎లో కూడా రాత్రి 9.30కి పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‎కు వచ్చాడు. ఇంకేముంది.. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. 

ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ, ఆమె కుమారుడు అస్వస్థతకు గురి అయ్యారు. తొక్కిసలాట జరగడంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. వెంటనే వారికి పోలీసులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. మృతురాలిని రేవతి (36)గా పోలీసులు గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.