హైదరాబాద్: జనసేన, యాక్టర్ కొణిదెల నాగబాబును హీరో అల్లు అర్జున్ కలిశారు. ఆదివారం (డిసెంబర్ 15) తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్లారు. దాదాపు అర్థగంట పాటు నాగబాబు నివాసంలో అల్లు అర్జున్ టైమ్ స్పెండ్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట ఘటన, అల్లు అరెస్ట్ పరిణామాలపై ఇరువురు చర్చించారు. అనంతరం నాగబాబు ఇంటి నుండి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. నాగబాబు నివాసానికి రావడానికి ముందు అల్లు అర్జున్ తన పెద్ద మామ, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.
చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాల గురించి బన్నీని అడిగి చిరంజీవి వివరాలు తెలుసుకున్నారు. అలాగే.. పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన గురించి మెగాస్టార్‌కు వివరించారు బన్నీ. దాదాపు గంట పాటు చిరు నివాసంలో బన్నీ ఫ్యామిలీ.. మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసింది. అనంతరం చిరు ఇంటి నుండి నాగబాబు తన భార్యతో కలిసి నాగబాబు ఇంటికి వెళ్లారు.
కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ కేసులో భాగంగా హీరో అల్లు అర్జున్ను 2024, డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.
ALSO READ | స్పిరిట్ లో ప్రభాస్ కి జంటగా సీతారామం హీరోయిన్..?
బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అల్లు అర్జున్ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బన్నీ ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ బన్నీకి ఊరట దక్కింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి బన్నీకి సంఘీభావం తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో బన్నీ కుటుంబ సమేతంగా మెగా బ్రదర్స్ ఇంటికి వెళ్లాడు. గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు నడుస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బన్నీ అరెస్ట్ కాగానే అతడి ఇంటికి మెగా ఫ్యామిలీ వెళ్లడం.. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత బన్నీ తన మామల ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న విభేదాలకు చెక్ పడ్డట్లే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.