Sardar2: గ్రాండ్గా 'సర్దార్ 2' పూజా కార్యక్రమం..కంబోడియా మిషన్ కోసం సిద్ధమవుతున్న కార్తీ

Sardar2: గ్రాండ్గా 'సర్దార్ 2' పూజా కార్యక్రమం..కంబోడియా మిషన్ కోసం సిద్ధమవుతున్న కార్తీ

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) హీరోగా నటించిన సర్దార్ మూవీ తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయింది.స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా వచ్చిన ఈ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్స్ లో నటించారు.పోలీస్గా,దేశ రక్షణ కోసం పోరాడే సీక్రెట్ ఏజెంట్ గా నటించి సక్సెస్ అందుకున్నారు.

‘‘ఒక్కసారి గూఢచారి అయితే..ఎప్పుడూ గూఢచారియే’’అంటూ సర్దార్‌ కొడుకు పాత్ర..రా ఏజెంట్‌గా ఎంపికవ్వడాన్ని గతంలో మేకర్స్  ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అతని తర్వాతి మిషన్‌ కంబోడియాలో జరగనుందని సమాచారం.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 

Also Read:ఆషాఢ మాసంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. ఏ ముహూర్తం.. ఏంటా ఆచారం..?

ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్ గా “సర్దార్ 2”(Sardar2)తెరకెక్కనుంది.ఇవాళ (జూలై 12న)ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.ఈ వేడుకలో హీరో కార్తీ తండ్రి శివ కుమార్ తో పాటుగా చిత్ర బృందం పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.."సర్దార్ 2 షూటింగ్ జూలై 15, 2024 న చెన్నైలో గ్రాండ్ సెట్‌లో ప్రారంభం కానుంది"అని తెలిపారు. 

డైరెక్టర్ పి.ఎస్‌.మిత్ర‌న్‌ తెరకెక్కించిన సర్దార్ మూవీని మంచి సామాజిక సందేశంతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.దీంతో సర్దార్ 2మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.డైరెక్టర్ పి.ఎస్‌.మిత్ర‌న్‌ త‌న క‌థ‌ల‌తో ప్రస్తుత అంశాల్ని,సామాజికాంశాల్ని స్పృశించ‌డంలో దిట్ట.విశాల్ హీరోగా వచ్చిన అభిమ‌న్యుడు, శివ కార్తికేయన్ తో హీరో మూవీస్ తో..తెలుగు ప్రేక్ష‌కులకి దగ్గరయ్యారు. 

సర్దార్ కథ విషయానికి వస్తే..

స‌మ‌స్త జీవ‌కోటి ప్రాణ‌ధారమైన నీటి  నిర్వ‌హ‌ణ మొత్తం..ప్రైవేటీక‌ర‌ణ చేయడం వల్ల..నీటిని ఎలా కలుషితం చేస్తున్నారో..వాటర్ బాటిల్స్ వినియోగం వల్ల ఎంతటి ప్రమాదం నెలకొందో..చక్కగా చూపించారు.అలాగే ఈ అంశంతో పాటు..దేశ రక్షణలో భాగంగా పనిచేసే ఓ గూఢ‌చారికి దేశ ద్రోహి అనే ముద్ర పడటాన్ని చూపించిన తీరు ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

ఒక దేశం ఒక పైప్‌లైన్ పేరుతో కొంత‌మంది తమ వ్యాపార సామ్రాజ్యాలని బలపరుచుకొనుటకు నీటిని త‌మ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏం చేశారు? దాని కోసం ఎక్క‌డో  అజ్ఞాతంలో,దేశ‌ద్రోహిగా అని ముద్ర‌ప‌డిన ఓ వ్య‌క్తి ఎలా బ‌య‌టికొచ్చి..ఆ స్వార్థ‌ప‌రుల ఎత్తుల్ని చిత్తు చేశాడ‌న్న‌ది కీలకంగా చూపించారు మిత్రన్.ప్రస్తుతం తీయబోయే సర్దార్ 2లో డైరెక్టర్ ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడో చూడాలి మరి.