Kiccha Sudeep: నా సినీ ప్రయాణం 28 ఏళ్లు..నేను ఎప్పటికీ ఉత్తమ నటుడినని చెప్పను

Kiccha Sudeep: నా సినీ ప్రయాణం 28 ఏళ్లు..నేను ఎప్పటికీ ఉత్తమ నటుడినని చెప్పను

ఎటువంటి పాత్రకైనా పర్‌‌ఫెక్ట్ అనిపించుకోగల సత్తా కొందరికే ఉంటుంది. అలాంటి నటుడే కిచ్చా సుదీప్(Kiccha Sudeep). కన్నడలో ఆయన స్టార్ హీరో. తెలుగువారికి ఆయనో బెస్ట్ విలన్. బాలీవుడ్ వారికి బెస్ట్ యాక్టర్. మొత్తంగా అందరికీ ఆయన ఫేవరేట్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో తన నటనకు తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్గా ఫిదా అయ్యారు. 

లేటెస్ట్గా కిచ్చా సుదీప్ తన 28 ఏళ్ల సినిమా కెరీర్‌ను ఉద్దేశిస్తూ స్పెషల్ నోట్ రాశారు.'తాను సినిమా ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుండి..ఇపుడు ఇంతటి స్థాయికి రావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు.

‘మొదటిసారిగా కంఠీరవ స్టూడియోలో అంబరీష్ మామతో కెమెరా ముందుకు వచ్చిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడే నా సినీ ప్రయాణం 28 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇన్నేళ్ల నా సినిమా ప్రయాణాన్ని దేవుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నా. రైటర్స్, ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, డైరెక్టర్స్ ఇలా ఎంతోమంది టెక్నీషియన్స్ ఇచ్చిన సహకారం వల్లే ఈ ప్రయాణం కొనసాగుతోంది. వాళ్లందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను.

ఈ సినిమా ప్రయాణంలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ప్రతి చిన్న అంశాన్ని ఎంజాయ్‌ చేస్తూ వస్తున్నాను. నేను ఎప్పటికీ ఉత్తమ నటుడినని చెప్పను. కానీ, మేకర్స్ నాకిచ్చిన ప్రతి పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’ అని నోట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కిచ్చా సినిమా కెరీర్కు విషెష్ చెబుతున్నారు. 

సుదీప్ మొదటి సినిమా ‘థయవ్వా’. సునీల్ కుమార్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించారు సుదీప్. ఆ తర్వాత మూడేళ్లకి ‘స్పర్శ’ చిత్రంలో హీరోగా నటించే చాన్స్ దొరికింది. ఆ నెక్స్ట్ ఇయర్ చేసిన ‘హచ్చా’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ‘కిచ్చా’ సినిమాతో స్టార్‌‌ అయిపోయారు. అందుకే ఆయన్ని అందరూ కిచ్చా సుదీప్ అంటుంటారు.

ఇండస్ట్రీలో కూడా సౌమ్యుడు, స్నేహశీలి అనే పేరుంది సుదీప్‌కి. ఎంత బిజీగా ఉన్నా ఇతర హీరోల సినిమాలకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయమని అడిగినప్పుడు నో అనరాయన. చాలా సినిమాలకి వాయిస్ ఇచ్చారు. ఎన్నో సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. నిడివి గురించి పట్టించుకోకుండా చిన్న పాత్రనైనా చేయడం, స్టార్‌‌డమ్ కోసం పాకులాడకుండా అందరితో కలివిడిగా ఉండటమే సుదీప్‌ స్పెషాలిటీ అని అందరూ అంటుంటారు.

ఆయన మరెన్నో సంవత్సరాలు ఇలాగే ముందుకు కొనసాగాలని, కెరీర్‌‌లో ఎన్నో విజయాలు అందుకోవాలని సినిమా లవర్స్ తో పాటు..సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు విషెష్ చెబుతున్నారు.