హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అయితే కిరణ్ అబ్బవరం 2019లో రిలీజ్ అయిన రాజావారు రాణీగారు అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అరడజనుకి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఇందులో ఎస్. ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే సినిమాలు తప్ప మిగిలినవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే నటుడు కిరణ్ అబ్బవరం మాత్రం కసిగా ముందుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా కిరణ్ అబ్బవరంపై ఇండస్ట్రీలో ఓ వర్గం నుంచి, సోషల్ మీడియా ట్రోలర్స్ నుంచి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. ఇక అతని పనైపోయింది. తాను సినిమాలు మానేసి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని.. ఇలా కసితో టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ‘క’ అనే సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నం చేస్తే.. ‘పవన్ కల్యాణ్‌కే సాధ్యం కాలేదు. నువ్వు పాన్ ఇండియా సినిమా చేస్తావా’ అంటూ ప్రశ్నలు కూడా సంధించడం మొదలెట్టారు.
అంతేకాకుండా ఓ సినిమాలో అయితే నేరుగా కిరణ్ని ట్రోల్ చేశారు. కొంతమంది ‘ఈ హీరో వెనుక ఓ పొలిటీషన్ ఉన్నాడు’ అంటూ గాసిప్పులు లేవదీశారు. ఇవి కిరణ్‌కి బాగా హర్ట్ చేశాయి. దాంతో తాజా ఈవెంట్ /లో నాతో ఏంటీ మీకు ప్రాబ్లెమ్, నేను ఎదగకూడదా? అంటూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేశాడు. వివరాల్లోకి వెళితే..
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ క (KA). ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. దీపావళి సందర్బంగా రేపు గురువారం (అక్టోబర్ 30న) థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 29న) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా తనని తొక్కేసేందుకు కుట్ర చేస్తున్న వారిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.తనతో ప్రాబ్లెమ్ ఏంటంటూ మండిపడ్డాడు. కిరణ్ అనేవాడు ఎదగ కూడదా’ అని సూటిగా సంధించిన ప్రశ్న చాలామంది ఇండస్ట్రీ వారికి.. తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా గుచ్చుకుంటోంది.
'నాకు యాక్టింగ్ రాక కాదు.. సరిగ్గా నిద్ర లేక నేను ఇప్పటివరకు ఎనిమిది సినిమాల్లో నాలుగు డీసెంట్ హిట్లు పడ్డాయి, అంటే నేను ఫెయిల్యూర్ యాక్టర్ ని కాదు. హిట్స్ ప్లాప్స్ అందరి లైఫ్‌లో కామన్, అసలు నాలాంటోడు సినిమాలు తీసి థియేటర్ వరకు రావడమే సక్సెస్' అని అన్నారు. అయితే, ఇండస్ట్రీకి ఎంతోమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారని కూడా గుర్తుచేశారు.
ఏమీ లేని చిరంజీవి మెగాస్టార్ అవ్వలేదా? ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని రవితేజ, నాని, విశ్వక్‌సేన్, విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ, అడవిశేష్.. వీళ్లంతా ఇక్కడ ఎదగడం లేదా? ఒక్క చిరంజీవి సక్సెస్… వందలమందిని పరిశ్రమ వైపు అడుగులేసే ధైర్యాన్ని ఇచ్చింది.
ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెలో కలలు కంటూ వచ్చిన కిరణ్‌లాంటి వాళ్లు హిట్లు కొడితే, దాన్ని అడ్డుకొనే హక్కు ఎవరికి ఇచ్చారు? అంటూనే ‘ఈ సినిమా ఆడకపోతే… ఎవరికీ నచ్చకపోతే నేను సినిమాలే మానేస్తా’ అని ఛాలెంజ్ విసిరాడు కిరణ్. అయితే, క మూవీపై, తన నటన శైలిపై తనకు ఉన్న నమ్మకం ఎంత గట్టిదో తెలుపుతోంది. ప్రస్తుతం కిరం మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.