గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గొప్ప మనసు గురించి హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన రామ్ చరణ్ తో ఆయనకున్న అనుబంధం గురించి, రామ్ చరణ్ గొప్ప మనసు గురించి చెప్పుకొచ్చారు. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు, నటులు నిఖిల్ సిద్దార్థ్, కిరణ్ సబ్బవరం, రంగస్థలం మహేష్, దర్శకుడు బుచ్చిబాబు సన,బాబీ తదితరులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ మేము చిన్నప్పటినుండి ఒకే చోట పెరిగాం. చెన్నైలో మా ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండేవి. ఆలా చరణ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. చిరంజీవి గారిలాగే చరణ్ డి కూడా గొప్ప మనసు. 2018లో అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ఆడబిడ్డకు దుబాయ్ లో ఇమిగ్రేషన్ సమస్య వచ్చిందని. అందుకోసం ఐదు లక్షలు అవసరం అవుతాయి. అప్పుడు వెంటనే రామ్ చరణ్ కి కాల్ చేసి విషయం చెప్పాను. నిమిశాల్లోనే డబ్బులు పంపించేశాడు చరణ్. అలాంటి గొప్ప వ్యక్తి మరిన్ని గొప్ప శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వీడియోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్, మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇక మంచు మనోజ్ ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. వరుణ్ కోరుకొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.