తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూ: ప్రకాష్ రాజ్‎కు హీరో మంచు విష్ణు స్వీట్ వార్నింగ్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూ జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువు నూనె, కొవ్వు ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే లడ్డూ కల్తీ ఇష్యూపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీ ఇష్యూపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

‘‘మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపి నిందితులపై యాక్షన్ తీసుకోండి. అంతేకానీ మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు..? మీ స్నేహితుల వల్ల (బీజేపీ) ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అన్న మంచు విష్ణు.. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో మీరు అన్నట్లుగా మతపరమైన కామెంట్స్ ఎక్కడున్నాయని ప్రకాష్ రాజ్‎ను ప్రశ్నించారు. కోట్లాది మంది హిందువులకు నమ్మకమైన తిరుపతి లడ్డూ ప్రసాదంపై ఇలాంటి కామెంట్స్ అవసరం లేదని.. మీ హద్దుల్లో మీరు ఉండండని ప్రకాష్ రాజ్‎కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. మరీ విష్ణు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.