
- కార్ల సెగ్మెంట్‌లో లీడర్‌గా కొనసాగుతన్న మారుతి
న్యూఢిల్లీ: టూవీలర్ సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్ లీడర్‌గా కొనసాగుతోంది. కంపెనీ 2024–25 లో 54 లక్షల బండ్లను అమ్మింది. 28.84 శాతం మార్కెట్ వాటాతో టాప్ కంపెనీగా కొనసాగుతోంది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం, హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 48 లక్షల బండ్లను అమ్మింది.
టూవీలర్ సెగ్మెంట్‌లో 25.37 శాతం మార్కెట్ వాటాతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. టీవీఎస్ మోటార్ 33 లక్షల బండ్లను అమ్మగా, 17.49 శాతం మార్కెట్ వాటాతో మూడో ప్లేస్ దక్కించుకుంది. 2024–25 లో మొత్తం టూ-వీలర్ రిజిస్ట్రేషన్లు ఏడాది లెక్కన 8 శాతం పెరిగి సుమారు 1.89 కోట్ల బండ్లకు చేరుకున్నాయి.
కార్లలో తిరుగులేని మారుతి
కార్ల విభాగంలో మారుతి సుజుకీకి తిరుగులేదు. ఈ కంపెనీ 2024–25 లో సుమారు 16.72 లక్షల బండ్లను అమ్మింది. కంపెనీ మార్కెట్ వాటా 40.25 శాతంగా రికార్డయ్యింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 16.08 లక్షల బండ్లను అమ్మగా, అప్పుడు 40.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కిందటి ఆర్థిక సంవత్సరంలో 5.59 లక్షల బండ్లను అమ్మగా, 13.46 శాతం మార్కెట్ వాటాతో రెండో ప్లేస్ దక్కించుకుంది.
టాటా మోటార్స్ 5.36 లక్షల యూనిట్లను అమ్మింది. 12.9 శాతం మార్కెట్ వాటాతో మూడో ప్లేస్‌లో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా 5.13 లక్షల బండ్లను అమ్మింది. 12.34 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో మొత్తం 41.53 లక్షల ప్యాసింజర్ బండ్లు అమ్ముడయ్యాయి. ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 6 శాతం పెరిగి సుమారు 2.61 కోట్ల బండ్లకు ఎగిశాయి.